శ్రీలంక ప్రపంచ కప్ విజేత క్రికెట్ కెప్టెన్ అర్జున రణతుంగ, శ్రీలంక లెజెండరీ క్రికెటర్ సనత్ జయసూర్య రోడ్లమీదకు వచ్చారు. దేశ ఆర్థిక సంక్షోభంపై బాధ్యత వహిస్తూ అధ్యక్షుడిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వీధుల్లో నిరసనలలో పాల్గొన్నారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సను పదవీచ్యుతున్ని చేయడానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. శ్రీలంక 1948లో స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి అతి దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసర వస్తువుల తీవ్రమైన కొరత, బ్లాక్‌అవుట్‌లు దారుణమైన దుస్థితికి కారణమయ్యాయి.
ఈరోజు బయట మా అభిమానులు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నా కూడా ప్రభుత్వానికి భజన చేస్తూ కూర్చోలేం.. ప్రజలకు మా అవసరం ఉంది.. అందుకే ప్రత్యక్ష పోరాటానికి దిగామని రణతుంగ అన్నారు. క్రీడాకారులైనా సరే.. దేశం కష్టాల్లో ఉందంటే చూస్తూ ఊరుకోరని రణతుంగ అన్నారు. జయసూర్య నినాదాలు చేస్తూ రాజపక్స ఇంటి ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లు దూకే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో జయసూర్య లోపలికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. రాజకీయపరంగా నిరకుంశ పాలనతో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని.. గొటబయ రాజపక్స గద్దె దిగాలని మాజీ క్రికెటర్ మహేళ జయవర్దనే అన్నారు.
శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకీ దారుణంగా దిగజారుతూ ఉన్నాయి. శ్రీలంకలో ఇంధనం విక్రయాలపై పరిమితులు విధించారు. టూ వీలర్లకు రూ.వెయ్యి, త్రీ వీలర్లకు రూ.1,500, కార్లు, వ్యాన్లు, జీప్‌లకు రూ.5,000 మేరకే పెట్రోల్, డీజిల్ పోయనున్నారు. వాణిజ్య వాహనాలను రేషన్ నుంచి మినహాయించారు. విద్యుత్ కోతలు కూడా రోజుకు 12 గంటలపాటు అమలవుతున్నాయి. తీవ్ర వంటగ్యాస్ కొరతను తీర్చేందుకు భారత్‌ను శ్రీలంక సాయం కోరింది.