విమానం ల్యాండ్ అవుతుండగా.. కుక్కను తీసుకొని బయటకు దూకేసిన జంట

Couple use emergency slide to get out of moving plane with their dog in US. విమానం అప్పుడే ల్యాండ్ అవుతోంది. ర‌న్‌వే పై

By Medi Samrat  Published on  25 Dec 2020 9:04 AM GMT
విమానం ల్యాండ్ అవుతుండగా.. కుక్కను తీసుకొని బయటకు దూకేసిన జంట

విమానం అప్పుడే ల్యాండ్ అవుతోంది. ర‌న్‌వే పై నెమ్మ‌దిగా క‌దుతోంది. ఇంకా ఆగ‌నేలేదు. ఇంత‌లో విమానంలో ప్ర‌యాణిస్తున్న ఓ జంట‌కు ఏమైందో ఏమో తెలీదు కానీ వెంట‌నే వారు అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఉప‌యోగించే స్లైడింగ్ మెట్లును ఓపెన్ చేశారు. ఆ మెట్ల‌పై నుంచి వారు జారుకుంటూ కింద‌ప‌డ్డారు. వారితో పాటు వారి పెంపును కుక్క‌ను కూడా తీసుకొచ్చారు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని న్యూయార్క్ న‌గ‌రంలో జ‌రిగింది. క‌దులుతున్న విమానంలోంచి దూకడం చాలా ప్ర‌మాదం అయినా.. స‌రే కొంద‌రు ఇలా తిక్క‌తిక్క‌గా ప్ర‌వ‌ర్తిస్తుంటారు.

ఆంటోనియో ముర్డాక్ (31), అతడి భార్య బ్రియన్నా గ్రెకో (27) అమెరికాలోని ప్లోరిడాలో నివ‌సిస్తున్నారు. వీరిద్దరూ ఫ్లోరిడా నుంచి న్యూయార్క్ విమానంలో వచ్చారు. విమానం న్యూయార్క్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వబోతోంది. అదింకా పూర్తిగా ఆగలేదు. రన్‌వే పై నెమ్మదిగా ముందుకు నడుస్తునే ఉంది. ఆస‌మ‌యంలో ఆంటోనియో జంట అత్యవసర సమయంలో ఉపయోగించే తలుపు తెరిచి, స్లైడింగ్ మెట్లను ఓపెన్ చేశారు. అవి ఓపెన్ కాగానే వెంటనే వాటిపై దూకి రన్‌వేపై పడ్డారు. ఇది గ‌మ‌నించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంట‌నే రంగంలోకి దిగారు. వారిని అదుపులోకి తీసుకుని ఇద్ద‌రి మీద క్రిమ‌న‌ల్ ట్రెస్‌పాసింగ్ కేసులు న‌మోదుచేశారు.

వీళ్లిద్దరూ ఇలా దూకేసిన కాసేపటికే విమానం దానికి కేటాయించిన ప్రాంతానికి వెళ్లి ఆగిపోయింది. ప్రయాణికులంతా అక్కడ సురక్షితంగా కిందకు దిగారని ఎయిర్ పోర్టు సిబ్బంది వెల్లడించారు. త్వ‌ర‌లో వీరిద్ద‌రిని కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌నున్నారు.


Next Story