బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ఓ చైనా మహిళ హాని తలపెట్టే అవకాశం ఉందన్న అనుమానంతో భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. సాంగ్ షియాలోన్ అనే చైనీ మహిళకు సంబంధించి పోలీసులు ఓ ఊహా చిత్రాన్ని విడుదల చేశారు. ఆమె పాస్ పోర్ట్, వీసా వివరాలను మీడియాకు విడుదల చేశారు. అయితే ఎట్టకేలకు బీహార్ పోలీసులు చైనా మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏడీజీ జేఎస్ గంగ్వార్ తెలిపారు.
బీహార్ లోని గయకు సమీపంలో ఉన్న బుద్ధగయలో, మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ ను దలైలామా గురువారం ఉదయం సందర్శించారు. ఇక్కడ మూడు రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. దలైలామా పర్యటన నేపథ్యంలో మహాబోధి టెంపుల్ కు వస్తున్న భక్తులను పోలీసులు క్షుణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. చైనా మహిళకు సంబంధించి గత రెండేళ్లుగా వేట కొనసాగగా.. ఎట్టకేలకు ఆ మహిళను పట్టుకున్నారు.
సాంగ్ షియాలోన్ అనే ఆరోపించిన గూఢచారి కొన్ని రోజుల క్రితం గయాలో కాల చక్ర పూజ సందర్భంగా దలైలామా ప్రసంగం సమయంలో అక్కడ ఉందని, ఆ తర్వాత అదృశ్యమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గయా పోలీసులు పాస్‌పోర్ట్, వీసా నంబర్, ఆమె స్కెచ్‌ను మీడియాకు ఇచ్చారు. చైనీస్ గూఢచారి దేశంలోని వివిధ ప్రదేశాలలో, ముఖ్యంగా గయాలో గత 2 సంవత్సరాలుగా ఉంటోంది. దలైలామా కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు ఈ చైనా గూఢచారి బోధ్‌గయా, చుట్టుపక్కల అనేక రహస్య ప్రదేశాలలో నివసించినదని పోలీసులు తెలిపారు.