చైనా మారథాన్‌లో ప్రకృతి ప్రకోపించిన వేళ ఆరుగురిని రక్షించిన రియల్ హీరో
China Shepherd Helps Marathon Runners.చైనా మారథాన్‌లో ఒక నిజమైన హీరో ఆరుగురిని రక్షించాడు.
By Medi Samrat Published on 25 May 2021 11:34 AM GMTచైనాలో ప్రకృతి ప్రకోపానికి 21 మంది రన్నర్లు బలైపోయిన విషయం తెలిసిందే. గాన్స్ ప్రావిన్స్‌లో నిర్వహించిన మౌంటెయిన్ మారథాన్‌పై వడగాళ్లు, మంచు వర్షం విరుచుకుపడింది. భీకరమైన చలిగాలుల దెబ్బకి మారథాన్‌లో పాల్గొన్న రన్నర్లు పిట్టల్లా రాలిపోయారు. అక్కడే ఒక నిజమైన హీరో బయట పడ్డాడు. అతనే ఝూ కెమింగ్. అక్కడి ఒక కొండపై తన గొర్రెలను మేపుకొనే ఝూ సమీపంలోని ఓ గుహలో కొని బట్టలు, ఆహార పదార్థాలు ఉంచుకునేవాడు. ప్రకృతి విలయ తాండవం సృష్టించే సమయంలో అతను కూడా ఈ గాలులకు బెదిరిపోయి గుహలోకి వెళ్లి తలదాచుకున్నాడు.
కానీ ఏదో అనుమానం తో కొద్దీ సేపటి తరువాత బయటికి వచ్చి చూసేసరికి మారథాన్ రన్నర్స్ లో కొందరు విపరీతమైన చలికి తట్టుకోలేక కింద పడిపోయి ఉండడం గమనించాడు. అంతటి విపత్కర పరిస్థితుల్లోనే అతి కష్టం మీద కొందరిని గుహలోకి తీసుకువచ్చి రక్షించాడు. వారికి తన బట్టలు కప్పి, చిన్నపాటి మంట పెట్టి కాస్త వెచ్చదనం కల్పించాడు. వారి చేతులు కాళ్ళు మసాజ్ చేసి వారు తిరిగి కోలుకునేలా చేసాడు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమను కాపాడినందుకు ఝూ కు రన్నర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఝూ మొత్తం ఆరుగురిని రక్షించాడు.
అయితే కొనఊపిరితో ఉన్న మరికొందరిని తాను రక్షించలేక పోయానని ఝూ ఇప్పటికీ బాధ పడుతున్నాడు. తన కళ్ళముందే ఒక్కొక్కరూ మరణించడం చూసి చలించిపోయానన్నాడు. మారథాన్‌లో మొత్తం 172 మంది పాల్గొనగా.. 151 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మరో 21 మంది మరణించినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించిది.