భారత భూభాగంలో చైనా గ్రామాలు
China Sets Up 3 Villages Near Arunachal. భారత్ తో మేము శాంతి మాత్రమే కోరుకుంటూ ఉన్నామని చైనా చెబుతూ వస్తోంది.
By Medi Samrat Published on 6 Dec 2020 1:11 PM GMTభారత్ తో మేము శాంతి మాత్రమే కోరుకుంటూ ఉన్నామని చైనా చెబుతూ వస్తోంది. కానీ సరిహద్దుల్లో చేసే పనులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమైనా.. తమదేనని చైనా చాలా ఏళ్లుగా చెబుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో ఏకంగా మూడు గ్రామాలనే ఏర్పాటు చేసింది. 3,222 మందిని వలంటరీ బేసిస్‌పై ఈ గ్రామాలకు తరలించింది చైనా. భారత్, చైనా, భూటాన్ దేశాల జంక్షన్‌లో అరుణాచల్ ప్రదేశ్‌కు పశ్చిమాన ఉన్న బమ్ లా పాస్‌కు 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ గ్రామాల ను నిర్మించింది.
డోక్లామ్ సైనిక ఘర్షణ జరిగిన స్థలానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో చైనా గ్రామాల నిర్మాణం జరిగింది. లద్దాఖ్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలోనే చైనా ఈ మూడు గ్రామాలను నిర్మించినట్లు శాటిలైట్ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఆ ప్రాంతంలో 20 నిర్మాణాలతో తొలి గ్రామాన్ని నిర్మించినట్లు ప్లానెట్ ల్యాబ్స్ నుంచి పొందిన ఫొటోలు చూస్తే తెలుస్తోంది. నవంబర్ 28 నాటికి ఆ పక్కనే మరో రెండు గ్రామాలు వెలిశాయి. అందులో ఒక గ్రామంలో 50 వరకు నిర్మాణాలు ఉన్నాయి. ఈ మూడు గ్రామాలను ఒక్కో కిలోమీటర్ దూరంలో అధునాతన రోడ్లు ఉన్నాయంటే చైనా ఎలాంటి చర్యలకు పాల్పడుతూ ఉందో అర్థం చేసుకోవచ్చు.