అఫ్ఘానిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. ఈ క్రమంలో అఫ్ఘాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తరువాత తొలిసారిగా చైనా స్పందించింది. తాలిబన్లతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకోవాలన్న అఫ్గాన్ ప్రజలు హక్కును చైనా గౌరవిస్తోంది. ఆ దేశంతో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ విదేశాంగ శాఖ ప్రతినిధి వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే.. అఫ్ఘానిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో.. ఆ దేశ భవిష్యత్తుపై, అక్కడి మహిళలు, మైనారిటీల భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు బ్రిటన్ ప్రధాని తాలిబన్ల ప్రభుత్వాన్ని ఎవరూ గుర్తించకూడదని తాజాగా ప్రకటించారు. దాదాపుగా ప్రజస్వామ్య దేశాలన్నీ ఇదే పంథాను ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక మొదటి నుంచీ తాలిబన్లకు మద్దతిస్తున్న పాకిస్థాన్, చైనా ఏం చేయబోతున్నాయనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.