అమెరికా-చైనా దేశాలు ప్రపంచంలో ఆధిపత్యం కోసం పోరాడుతూ ఉన్నాయి. చైనాను టార్గెట్ చేస్తూ అమెరికా ఎన్నో ఆరోపణలు చేస్తూ వచ్చింది. అలాగే చైనా కూడా ఛాన్స్ దొరికితే చాలు అమెరికాను దెబ్బ తీయాలి అనే తలంపుతో పని చేస్తూ ఉంది. అమెరికా సైనికులను చంపడానికి చైనా పెద్ద ప్లాన్ రచించినట్లుగా తెలుస్తోంది.
అమెరికా సైనికులను చంపితే నజరానాలు ముట్టచెబుతామంటూ ఆఫ్ఘనిస్థాన్ యోధులకు చైనా ఎరవేస్తోందని సీఐఏ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను సీఐఏ ట్రంప్ కు అందించిందా? లేదా అన్నది తెలియకపోయినా.. అమెరికా సైనికులను చంపడానికి పెద్ద ప్లాన్ వేసింది చైనా అని సీఐఏ చెబుతోంది. ఏ విషయాన్నైనా అమెరికా అధ్యక్షుడికి చేరవేస్తూ ఉన్న సీఐఏ ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ కు చెప్పింది. ఈ ఘటనపై ట్రంప్ స్పందన ఎలా ఉంటుందో అని ప్రపంచం ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉంది.
ఆఫ్ఘనిస్థాన్, సిరియా వంటి దేశాలు అమెరికా దళాలకు యుద్ధరంగాలుగా మారాయి. ఆ ప్రాంతాల్లో అమెరికాను దెబ్బ కొట్టాలని చైనా భావించిందని తాజాగా సీఐఏ ఆరోపించింది. రష్యా కూడా ఇదే తరహాలో అమెరికా సైనికులను చంపేందుకు కుట్రలకు పాల్పడుతోందని సీఐఏ నివేదికలో పొందుపరిచింది. దీన్ని ట్రంప్ నమ్మలేదు. చైనా విషయంలో కూడా సీఐఏ ఇలాంటి నివేదికనే అందించింది. ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది.