చైనాలో భారీ భూకంపం సంభవించింది. సిచువాన్ ప్రావిన్స్‌లోని లుండింగ్ కౌంటిలో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నాం 12.25 గంటల సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.8గా నమోదైందని అధికారులు తెలిపారు. చెంగ్డూకు నైరుతి దిక్కున 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప కేంద్రం నుంచి 43కి.మీ మేర ప్రభావం చూపిందని అంటున్నారు.
భూకంపం కారణంగా విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, రవాణ, టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. భూ కంపం సంభవించిన ప్రాంతాల్లో రక్షణ, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 46 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. పలు భవనాలు కుప్పకూలడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు అంటున్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనని సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
టిబెట్‌కు ఆనుకుని ఉన్న సిచువాన్ ప్రావిన్స్‌లో తరచూ భూపంకంపాలు సంభవిస్తుంటాయి. 2008లో సిచువాన్‌లో 7.9 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. దాదాపు 90వేల మందికి పైగా ప్రజలు మరణించారు.