తూర్పు లడఖ్ ప్రాంతానికి సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో ఎయిర్ బేస్ విస్తరణను చైనా చేపట్టింది. ఇప్పటికే అక్కడ ఓ ఎయిర్ బేస్ ఉండగా.. దాన్ని ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా పునర్ నిర్మిస్తోంది. వాస్తవాధీన రేఖకు అత్యంత చేరువలో ఉండే షాక్చే (షింజియాంగ్ ప్రావిన్స్) పట్టణంలో ఈ ఎయిర్ బేస్ నిర్మాణం జరుగుతోంది. యుద్ధ విమాన కార్యకలాపాలు సాగించాలన్నది చైనా ప్రణాళిక. వాస్తవాధీన రేఖ వెంబడి చైనాకు కష్గర్, హోగన్ ఎయిర్ బేస్ లు ఉండగా, వాటి మధ్య దూరం 400 కిలోమీటర్లు. ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో తాజా ఎయిర్ బేస్ నిర్మాణం చేపడుతోంది.
వాస్తవాధీన రేఖ పొడవునా చైనా యుద్ధ విమానాల కార్యకలాపాలు ఎంతో సులభతరం అవుతాయి. షాక్చే ఎయిర్ బేస్ నుంచి చైనా ఫైటర్ జెట్ల కార్యకలాపాలు మొదలుకాబోతున్నాయని చైనా రక్షణ రంగ వర్గాలు చెబుతున్నాయి. భారత్ తో పోల్చితే చైనా వాయుసేన ఈ ప్రాంతంలో బలహీనం అని చెప్పాలి. ఈ ప్రాంతంలో భారత్ యుద్ధ విమానాలను అతి తక్కువ సమయంలో మోహరించే వీలుంటుంది. ఏకకాలంలో చైనా, పాకిస్థాన్ లతో పోరాడాల్సి వచ్చినా లడఖ్ ప్రాంతంలోని ఎయిర్ బేస్ ల నుంచి యుద్ధ విమానాలను పంపే వీలుంది. అందుకే చైనా కూడా ఆ ప్రాంతంలో విమానాల రాకపోకల కోసం ఎయిర్ బేస్ విస్తరణ పనులు చేపడుతోంది.