మెక్సికో దేశంలో కాల్పుల కలకలం రేగింది. సెంట్రల్ మెక్సికోలో రెండు డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులతో సహా కనీసం ఎనిమిది మంది మరణించారని అధికారులు తెలిపారు. ప్రాంతీయ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్థరాత్రి గ్వానాజువాటో రాష్ట్రంలోని సిలావో మునిసిపాలిటీలోని ఇళ్లపై మోటారుసైకిల్‌పై వచ్చిన ఇద్దరు ముష్కరులు కాల్పులు జరిపారు. మృతుల్లో ఏడాది, 16 ఏళ్ల బాలిక కూడా ఉన్నారు. శాంటా రోసా డి లిమా, జాలిస్కో న్యూ జనరేషన్ అనే రెండు డ్రగ్స్ ముఠాల మధ్య కాల్పులు జరిగాయి. అయితే తరచూగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు.
డ్రగ్స్ ముఠాల కాల్పులతో మెక్సికోలోని గ్వానాజువాటో అత్యంత హింసాత్మక రాష్ట్రాలలో ఒకటిగా మారింది. లాభదాయకమైన మాదకద్రవ్యాల రవాణా, దొంగిలించబడిన ఇంధన మార్కెట్ల నియంత్రణపై ముఠాలు దాడులకు పాల్పడుతున్నాయి. నవంబర్ మధ్యలో సిలావోలో ఇలాంటి రెండు దాడుల్లో 11 మంది మరణించారు. 2006 నుండి ప్రభుత్వం వివాదాస్పద మాదకద్రవ్యాల వ్యతిరేక సైనిక చర్యను ప్రారంభించినప్పటి నుండి, అధికారిక గణాంకాల ప్రకారం మెక్సికో 300,000 కంటే ఎక్కువ హత్యలను నమోదు చేసింది.