సోమాలియా రాజధాని మొగదిషులోని విద్యా మంత్రిత్వ శాఖ వెలుపల శనివారం పేలిన రెండు కారు బాంబులలో 100 మందికి పైగా మరణించారు. అంతేకాకుండా 300 మంది గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు ఆదివారం తెల్లవారుజామున ఒక ప్రకటనలో తెలిపారు. మా ప్రజలను ఊచకోత కోసారని అధ్యక్షుడు హసన్ షేక్ మొహమ్మద్ చెప్పారు. పేలుడు జరిగిన ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. శనివారం మధ్యాహ్నం సంభవించిన రెండు పేలుళ్లు పలు ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు ఉండే రద్దీ ప్రాంతంలో జరిగాయి.
పేలుళ్లు విద్యా మంత్రిత్వశాఖ కార్యాలయం వద్ద జరిగాయి. ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఇంతవరకు ఏ ఒక్కరూ ప్రకటన జారీ చేయలేదు. అల్ ఖైదా అనుబంధ అల్ షబాబ్ గ్రూప్ జరుపుతున్న హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై చర్చించడానికి సోమాలియా అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, ఇతర సీనియర్ అధికారులు సమావేశమైన రోజునే ఈ పేలుళ్లు జరిగాయి.
ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఎవరూ వెంటనే ప్రకటించలేదు, అయితే అధ్యక్షుడు ఇస్లామిస్ట్ గ్రూప్ అల్ షబాబ్‌ను నిందించారు. మొదట ఒక బాంబ్ బ్లాస్ట్ చేశారని.. ఆ తర్వాత అంబులెన్స్‌లు, బాధితులకు సహాయం చేయడానికి పలువురు ప్రజలు గుమిగూడిన సమయంలో ఇంకో బ్లాస్ట్ చేశారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న కిటికీలు ధ్వంసమయ్యాయి. రోడ్డు మొత్తం రక్తంతో నిండిపోయింది.