కశ్మీర్ అంశం పై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పీవోకేలోని తరార్ ఖాల్ ఎన్నికల ప్రచారంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ కశ్మీర్ ప్రజలు స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నారా? లేదంటే పాకిస్థాన్‌లో కలిసిపోవాలనుకుంటున్నారా? అనేది అక్కడి ప్రజల ఇష్టమని అన్నారు. దీనిపై తాము ఎటువంటి బలవంత చర్యలను దిగబోమని అన్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) నాయకుడు మరియం నవాజ్ జూలై 18 న పీవోకేలో జరిగిన ఎన్నికల సమావేశంలో ప్రసంగిస్తూ కశ్మీర్ స్థితిని మార్చడానికి.. దానిని ఒక ప్రావిన్స్‌గా మార్చడానికి పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ పాక్ విపక్ష నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. అలాంటి ఆలోచన తమకు లేదని అన్నారు. ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం కశ్మీరీలను వారి భవిష్యత్తును నిర్ణయించడానికి అనుమతించే రోజు వస్తుందని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఆ రోజున కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ లో చేరాలని నిర్ణయించుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ఆదేశించిన ప్రజాభిప్రాయ సేకరణ తరువాత, కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ లో నివసించడానికి లేదా స్వతంత్ర రాష్ట్రంగా మారే అవకాశం ఉంటుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.