పంజాబ్ రాష్ట్రం దగ్గర ఉన్న భారత్-పాకిస్తాన్ బోర్డర్ లో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాల స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు అధికారులకు చిక్కుతూనే ఉన్నాయి. తాజాగా కూడా పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లోని పంట పొలంలో ఇండియా-పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బోర్డర్ (ఐబి) ట్రాక్ సమీపంలో హెరాయిన్‌గా అనుమానిస్తున్న ఎనిమిది ప్యాకెట్ల నిషిద్ధ పదార్థాలను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బిఎస్ఎఫ్ అధికారులు ధృవీకరించారు. బోర్డర్ అవుట్‌పోస్ట్ పచారియన్ వద్ద మోహరించిన బిఎస్ఎఫ్ దళాలు వరి పండిస్తున్న పొలంలో ఆదివారం మధ్యాహ్నం హెరాయిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. "బోర్డర్ పిల్లర్ (బిపి) 180/3 - 180/4 మధ్య ఈ రికవరీ జరిగింది" అని ఫోర్స్ తెలిపింది.
స్వాధీనం చేసుకున్న వస్తువులు కర్రల ఆకారంలో ఉన్నాయని బిఎస్ఎఫ్ తెలిపింది. "మొత్తం ఎనిమిది కర్రల్లో మూడు పసుపు రంగు టేపుతో మరియు ఐదు వెండి రంగు టేపుతో ప్యాక్ చేయబడ్డాయి. గడ్డితో వరి పంటలలో దాచబడ్డాయి." అని తెలుస్తోంది. ఎటువంటి అనుమానం రాకుండా కట్టెల లాగా అక్కడ ఉంచారు. జనవరి 2021 నుండి బోర్డర్ ఔట్‌పోస్ట్ పంచారియన్ ప్రాంతంలో ఇది మూడవ సీజ్ అని తెలుస్తోంది. ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో హెరాయిన్ ను స్మగ్లింగ్ చేస్తూ పలు మార్లు కొందరు వ్యక్తులు దొరికిపోయారు.