కొత్త రకం కరోనా వైరస్ తో పెరిగిన మరణాల రేటు!
British PM says new variant may carry higher risk of death. ఇప్పటివరకు కరోనా వైరస్ అతి భయంకరంగా అన్ని దేశాలలో వ్యాపించడం
By Medi Samrat Published on 23 Jan 2021 3:11 PM IST
ఇప్పటివరకు కరోనా వైరస్ అతి భయంకరంగా అన్ని దేశాలలో వ్యాపించడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ గతేడాది చివరిలో లండన్ లో నమోదైన కొత్తరకం కరోనా వైరస్ పాత వైరస్ కన్నా అత్యంత ప్రమాదకరమైనదని తాజాగా యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక ప్రకటన చేశారు. పాత కరోనా వైరస్ తో పోలిస్తే, ఈ కొత్త రకం వైరస్ వేగంగా వ్యాపించడమే కాకుండా, ఎక్కువ శాతం మరణాల రేటు కూడా నమోదు అవుతున్నట్లు ప్రాథమిక నిర్ధారణ ద్వారా ఓ అంచనాకు వచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారని బోరిస్ జాన్సన్ తెలిపారు.
ప్రస్తుతం లండన్ లో అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్ ఫైజర్, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాలు అన్ని రకాల కరోనా వైరస్ పై సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. కరోనా వ్యాక్సిన్ పనితీరుపై బ్రిటన్ ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ
సలహాదారు పాట్రిక్ వ్యాలన్స్ సైతం ధ్రువీకరించారు. ముందుగా వ్యాపించిన కరోనా వైరస్ ప్రభావం కన్నా, ఈ వైరస్ ప్రభావం వల్ల అధిక మరణాలు నమోదవుతున్నాయనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ మరణాల రేటు పై కచ్చితంగా ధ్రువీకరించడానికి ఇంకా స్పష్టమైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఉన్న ఆధారాలు పరంగా చూస్తే పాత కరోనా వైరస్ సోకడం వల్ల ప్రతి 1000 మందిలో 10మంది మృత్యువాత పడితే, కొత్త కరోనా వైరస్ వల్ల ప్రతి వెయ్యి మందిలో 13 మంది మృత్యువాత పడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే పాత వైరస్ కన్నా కొత్త వైరస్ వల్ల 30 శాతం అధికంగా ప్రాణాంతకమని తెలుస్తోంది.ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం వల్ల కొంతవరకు మనకు రక్షణ కలిగిస్తుందని చెప్పవచ్చు. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మరికొన్ని రోజులపాటు కరోన జాగ్రత్తలను పాటిస్తూ, వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కొంత వరకు ఈ కొత్తరకం వైరస్ ను అరికట్టవచ్చని అధికారులు తెలియజేస్తున్నారు.