చనిపోయిన వ్యక్తిని బ్యాంకుకు తీసుకుని వచ్చిన మహిళ.. ఏమి చేద్దామని అనుకుందంటే?

చనిపోయిన 68 ఏళ్ల వ్యక్తి సంతకాన్ని ఉపయోగించి బ్యాంకు రుణం పొందేందుకు ప్రయత్నించినందుకు బ్రెజిల్‌కు చెందిన మహిళను అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  18 April 2024 9:15 PM IST
చనిపోయిన వ్యక్తిని బ్యాంకుకు తీసుకుని వచ్చిన మహిళ.. ఏమి చేద్దామని అనుకుందంటే?

చనిపోయిన 68 ఏళ్ల వ్యక్తి సంతకాన్ని ఉపయోగించి బ్యాంకు రుణం పొందేందుకు ప్రయత్నించినందుకు బ్రెజిల్‌కు చెందిన మహిళను అరెస్టు చేశారు. వీల్ చైర్ లో శవాన్ని బ్యాంకుకు తీసుకెళ్లింది. అతడు బతికే ఉన్నాడని నమ్మించడానికి ప్రయత్నించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం నాడు రియో ​​శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎరికా వియెరా నూన్స్ అనే మహిళ చనిపోయిన వ్యక్తిని బ్యాంకుకు తీసుకుని వచ్చింది. గంటల తరబడి అక్కడే ఉంది.. ఎక్కడికి వీలైతే అక్కడికి బ్యాంకులో వీల్ చైర్ పై అతడిని తిప్పింది. ఆమె అతడిని తన మామగా చెప్పుకుంది. ఆ వ్యక్తి 17,000 రియాస్ (సుమారు రూ. 2.71 లక్షలు) రుణం పొందాలనుకుంటున్నాడని ఆమె చెప్పింది. ఆమె పెన్ను పట్టుకుని ఆ వ్యక్తి చేతిని ముందుకు కదిలించింది.. కానీ అతను స్పందించలేదు. అంకుల్ మీరు సంతకం చేయాలంటూ కదిలించింది.. కానీ అతడి నుండి ఉలుకూ పలుకు లేదు. వ్యక్తి తల వెనక్కి పడిపోవడంతో బ్యాంకు సిబ్బందికి అనుమానం వచ్చింది. వారు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఎరికాను అరెస్టు చేశారు. అనంతరం తదుపరి పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆ వ్యక్తి బ్యాంకు వద్ద మరణించాడని ఎరికా చెబుతూ ఉన్నా.. ఫోరెన్సిక్ విశ్లేషణలో అతడు అంతకుముందే చనిపోయాడని తేలింది. ఆ వ్యక్తి మరణంపై విచారణ జరిపి, అతనికి ఎరికాకు ఉన్న సంబంధాన్ని తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు.

Next Story