బ్రెజిల్ లో కరోనా మరణ మృదంగం

Brazil hits record 100,000 coronavirus cases in a day. కరోనా వైరస్‌ బ్రెజిల్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అక్కడ రికార్డు

By Medi Samrat  Published on  27 March 2021 4:15 AM GMT
బ్రెజిల్ లో కరోనా మరణ మృదంగం

కరోనా వైరస్‌ బ్రెజిల్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అక్కడ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్క రోజే 1,00,158 కేసులు వెలుగు చూసినట్టు బ్రెజిల్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అలాగే, తాజాగా మరో 2,777 మరణాలు కూడా సంభవించాయని పేర్కొంది. మంగళవారం రికార్డు స్థాయిలో 3251 మంది మృత్యువాత పడటంతో కరోనా ప్రవేశించిన తర్వాత అక్కడి మరణాలు 3లక్షల మార్కును దాటేసినట్టే. కేవలం గత 75 రోజుల్లోనే లక్ష మంది కరోనా ధాటికి బలైనట్టు ఆ దేశ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం కరోనా మరణాలతో ఐదు లక్షల పైచిలుకు మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా. బ్రెజెల్ 2 వ స్థానంలో ఉంది. ఇప్పటికే ఆస్పత్రులన్నీ పేషెంట్లతో నిండిపోగా... ఇదే పరిస్థితి కొనసాగితే అక్కడి హెల్త్ కేర్ వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉంది. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో వల్లే దేశంలో ఇంత దారుణ పరిస్థితి నెలకొందని సావ్ పౌలో గవర్నర్ డొరియా ఆరోపించారు. బోల్సోనారో ఒక సైకో లీడర్‌ అని... కరోనా సంక్షోభాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ బ్రెజిల్‌లో నలుగురు ఆరోగ్య శాఖ మంత్రులు మారారు. ప్రస్తుతం కార్డియాలజిస్ట్ డాక్టర్ మార్సెలో క్యురోగాను ఆరోగ్య మంత్రిగా నియమించారు. అంతకుముందు ఆర్మీ జనరల్ ఎడ్వర్డో పజుఎల్లోను ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించగా... ఎలాంటి వైద్య అనుభవం లేని వ్యక్తిని ఆరోగ్యశాఖ మంత్రిగా ఎలా నియమిస్తారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మరోసారి ఆ శాఖ మంత్రిని మార్చక తప్పలేదు.

ఇక కరోనా విషయంలో ఆ దేశ అధ్యక్షులు జైర్ బోల్సోనారో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే.వ్యాక్సిన్ అందరికీ తప్పనిసరి అని సుప్రీం కోర్టు చెప్తే... తాను మాత్రం వ్యాక్సిన్ వేయించుకోనని అన్నారు. అంతేకాదు,వ్యాక్సిన్‌పై జనాల్లో లేనిపోని గందరగోళం సృష్టించారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మొసళ్లలా మారిపోతే తనది బాధ్యత కాదని... మహిళలకు గడ్డాలు,పురుషుల గొంతు మహిళల్లా మారిపోతే తానేమీ చేయలేనని అన్నారు. అంతేనా... మాస్కులు కూడా ధరించాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు.




Next Story