శుక్రవారం ప్రార్థనల సమయంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని మదర్సా (జామియా హక్కానియా మదర్సా)లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది.

By Medi Samrat  Published on  28 Feb 2025 4:57 PM IST
శుక్రవారం ప్రార్థనల సమయంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని మదర్సా (జామియా హక్కానియా మదర్సా)లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుడులో మదర్సా అధినేతకు కూడా గాయాలయ్యాయి. ఈ మదర్సా ప్రావిన్స్‌లోని నౌషెరా ప్రాంతంలో ఉంది.

మదర్సాలోని ప్రధాన హాలులో శుక్రవారం ప్రార్థనల సమయంలో పేలుడు సంభవించడంతో అధికారులు నౌషేరాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఇది ఆత్మాహుతి దాడిగా తెలుస్తుంది.

మదర్సాను సెప్టెంబర్ 1947లో ఇస్లామిక్ పండితుడు మౌలానా అబ్దుల్ హక్ హక్కానీ స్థాపించారు. గత నెలలో కూడా పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో రోడ్డు పక్కన బాంబు పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

ఈ ఘటనపై ప్రధాని షాబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి పిరికి, హేయమైన చర్యలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న‌ మన సంకల్పాన్ని బలహీనపరచలేవని ఆయన అన్నారు. మేము దేశం నుండి అన్ని రకాల ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని నిర్ణయించుకున్నామన్నారు. పాకిస్తాన్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ కూడా పేలుడును ఖండించారు. ఘ‌ట‌న‌పై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Next Story