Pakistan Blast Video: పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 24 మంది దుర్మ‌ర‌ణం

పాకిస్థాన్‌లోని వాయువ్య బలూచిస్థాన్‌లో పేలుడు సంభవించినట్లు వార్తలు వచ్చాయి.

By Medi Samrat  Published on  9 Nov 2024 2:43 PM IST
Pakistan Blast Video: పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 24 మంది దుర్మ‌ర‌ణం

పాకిస్థాన్‌లోని వాయువ్య బలూచిస్థాన్‌లో పేలుడు సంభవించినట్లు వార్తలు వచ్చాయి. క్వెట్టా రైల్వే స్టేషన్‌లో జరిగిన బాంబు పేలుడులో 24 మంది మృతి చెందగా.. 40 మంది గాయపడ్డారు. ఈ ఘటన బలూచిస్థాన్‌లో కలకలం రేపుతోంది.

రాయిటర్స్ ప్రకారం.. మరణాల సంఖ్య ఇప్పుడు 24 కి పెరిగింది. పాకిస్తాన్ న్యూస్ ఛానెల్ జియో న్యూస్ సమాచారం ప్రకారం.. రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి రాకముందే రైల్వే స్టేషన్‌లోని బుకింగ్ కార్యాలయంలో పేలుడు సంభవించింది. ఎప్పటిలాగే స్టేషన్‌లో రద్దీ ఎక్కువగా ఉండటంతో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది.

పోలీసులు, రెస్క్యూ సిబ్బంది పేలుడు స్థలానికి చేరుకున్నారు. క్వెట్టా సివిల్ హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ విధించబడింది. అదనపు వైద్యులు, సహాయక సిబ్బందిని పిలిపించారు.

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జాఫర్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9 గంటలకు పెషావర్‌కు బయలుదేరాల్సి ఉంది. పేలుడు సంభవించినప్పుడు రైలు ఇంకా ప్లాట్‌ఫారమ్‌పైకి రాలేదని అధికారులు తెలిపారు. పేలుడు ఘటనలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు జియో న్యూస్‌కి తెలిపారు.

సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ (SSP) ఆపరేషన్స్ క్వెట్టా ముహమ్మద్ బలోచ్ మీడియాతో మాట్లాడుతూ.. పేలుడు ఆత్మాహుతి పేలుడుగా కనిపిస్తోందని అన్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు. మృతుల సంఖ్య గురించి సవివరమైన సమాచారం ఇస్తూ పేలుడులో మరణించిన వారి సంఖ్య 24, 40 మంది గాయపడ్డారని SSP ఆపరేషన్స్ బలోచ్ తెలిపారు.

పెషావర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ గమ్యస్థానానికి బయలుదేరే సమయంలో రైల్వే స్టేషన్‌లో పేలుడు సంభవించిందని పోలీసు అధికారి తెలిపారు. పేలుడు దాటికి ప్లాట్‌ఫారమ్ పైకప్పు కూడా దెబ్బతింది, నగరంలోని వివిధ ప్రాంతాలకు పేలుడు శ‌బ్ధం వినిపించింది. బాంబు నిర్వీర్య బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించిందని.. పేలుడు జరిగిన తీరుపై త్వరలో సమాచారం అందిస్తామని ఎస్‌ఎస్పీ ఆపరేషన్స్‌ తెలిపారు.

Next Story