ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 3 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకునేందుకు రష్యా చమురు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది కంపెనీ-టు-కంపెనీ ఒప్పందమని తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై మాస్కో దాడికి ప్రతిస్పందనగా పలు దేశాలు రష్యాపై చమురు దిగుమతి విషయంలో ఆంక్షలు విధించాయి. రష్యా చమురు కంపెనీల నుండి ముడి చమురు కొనుగోలుపై భారతీయ చమురు కంపెనీలపై ఎటువంటి ఆంక్షలు లేకపోవడంతో ఈ డీల్ కుదిరింది.
భారతదేశం యొక్క చట్టబద్ధమైన ఇంధన లావాదేవీలను రాజకీయం చేయరాదని ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే తెలిపాయి. రష్యన్ ఆయిల్ కంపెనీతో దిగుమతి ఒప్పందమనేది.. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం భారత్‌కు అందుబాటులో ఉన్న నిబంధనలు, షరతులపై ఉంది. రష్యా చమురుతో పాటు తన ఇతర వస్తువులను భారత్ కు తక్కువ ధరకే ఇవ్వాలని భావించింది.
రష్యా నుంచి ముడి చమురు దిగుమతి విషయంలో భారత్‌కు బ్యారెల్‌పై 20-25 డాలర్ల డిస్కౌంట్ ధరకు రష్యా ముడి చమురు సరఫరా చేయనుంది. గతవారం యూరోపియన్ ట్రేడర్ విటోల్ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మూడు మిలియన్ల బ్యారెళ్ల ముడి చమురు కొనుగోలు చేసింది. ఇది వచ్చే మే నెలలో అందుబాటులోకి వస్తుంది. హెచ్పీసీఎల్ కూడా ఈ వారం రెండు మిలియన్ల బ్యారెళ్ల రష్యన్ క్రూడాయిల్ కొనుగోలుకు టెండర్ దాఖలు చేసింది. ఇది కూడా వచ్చే మే నెలలో దిగుమతి అవుతుంది. మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ (ఎంఆర్పీఎల్) కూడా ఒక మిలియన్ బ్యారెల్ ముడి చమురు కోసం టెండర్ దాఖలు చేసింది.