Biden warns cyber attacks could lead to a ‘real shooting war’. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దూకుడు పెంచారు. రష్యా-చైనా దేశాలకు
By Medi Samrat Published on 28 July 2021 9:27 AM GMT
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దూకుడు పెంచారు. రష్యా-చైనా దేశాలకు జో బైడెన్ వార్నింగ్ ఇచ్చాడు. ఇటీవలి కాలంలో కొన్ని దేశాలు పనిగట్టుకుని అమెరికాపై సైబర్ దాడికి పాల్పడడంతో జో బైడెన్ కాస్త కటువుగానే వ్యాఖ్యలు చేశారు. శక్తిమంతమైన దేశాలతో అమెరికా యుద్ధమంటూ చేయాల్సి వస్తే దానికి సైబర్ దాడులే కారణమవుతాయని దేశాధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. రష్యా, చైనా నుంచి ఇటీవలి కాలంలో సైబర్ దాడుల ప్రమాదాలు పెరిగిపోయాయని.. ఇటీవల ఓ నెట్ వర్క్ మేనేజ్మెంట్ సంస్థ సోలార్ విండ్స్, కాలనియల్ పైప్ లైన్ కంపెనీ, మాంసం శుద్ధి సంస్థ జేబీఎస్, సాఫ్ట్ వేర్ కంపెనీ కసేయాలపై సైబర్ దాడులు జరపడంతో కొన్ని చోట్ల ఇంధనం, ఆహార సరఫరా ఆగిపోయిందని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని జో బైడెన్ తప్పుబట్టారు.
ఇలాంటి చర్యలు ఇక్కడితోనే అంతమవ్వాలని, అలా కాకుండా తాము యుద్ధానికి దిగాల్సి వస్తే తీవ్రమైన పరిణామాలుంటాయని హెచ్చరికలు జారీ చేశారు. డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసును సందర్శించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాతోనూ అమెరికాకు ముప్పు పొంచే ఉందని.. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యాన్ని కలిగి ఉన్న చైనా.. 2040 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ప్రయత్నాలు చేస్తోందని అన్నారు.