జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు.. భారత స్పందన బలహీనం
Biden calls India's response to Russia-Ukraine war 'shaky'.ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడికి దిగిన సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 22 March 2022 11:29 AM ISTఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడికి దిగిన సంగతి తెలిసిందే. నెలరోజులు కావొస్తున్నా.. ఇప్పట్లో ఈ యుద్ధం ముగిసేలా కనిపించడం లేదు. వందలాది మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపాలని ప్రపంచదేశాలన్ని పుతిన్‌ను కోరినప్పటికీ ఆయన సరేమీరా అనడంతో పాటు దాడులను ఉదృతం చేశారు. దీంతో రష్యాను దారిలోకి తెచ్చేందుకు అమెరికా, బ్రిటన్ సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు రష్యాపై ఆంక్షల కొరఢా ఝుళిపించాయి. మాస్కో నుంచి చమురు దిగుమతులను నిలిపివేశాయి. అయితే.. భారత్ ఈ విషయంలో తటస్థంగా ఉంది.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా మిత్ర దేశాల వైఖరి అంతా ఒక్కటిగానే ఉందని.. అయితే ఒక్క భారత్ మాత్రమే భిన్నమైన విధానాన్ని అవలంభిస్తున్నట్లు చెప్పారు. వాషింగ్టన్‌లో వ్యాపారవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ బైడెన్ ఈ వాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు వ్యతిరేకంగా అమెరికా ఆధ్వర్యంలోని భాగస్వామ్య పక్షం, నాటో, ఐరోపా యూనియన్, ఆసియా భాగస్వామ్య దేశాలు ఐక్యంగా నిలబడడం పట్ల బైడెన్ అభినందించారు. అసాధారణ స్థాయిలో ఆర్థిక ఆంక్షలతోనూ రష్యాను కట్టడి చేస్తున్నట్లు తెలిపారు.
క్యాడ్ కూటమిలోని జపాన్, ఆస్ట్రేలియా దేశాలు రష్యాపై ఒత్తిడి తెస్తున్నాయి. క్వాడ్ గ్రూప్‌లోని ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాలు రష్యా తీరును ఖండిస్తున్నాయని, కానీ రష్యా నుంచి డిస్కౌంట్‌లో ఆయిల్ కొనేందుకు సిద్దమైన ఇండియా విధానం భిన్నంగా ఉన్నట్లు బైడెన్ ఆరోపించారు. పుతిన్ నాటో విచ్ఛిన్నాన్ని కోరుకుంటున్నారని బైడెన్ తెలిపారు. అయితే.. పుతిన్ లెక్కతప్పిందని, నాటో కూటమి చరిత్రలో ఎన్నడూ లేనంత ఐక్యంగా, బలంగా ఉందన్నారు.