భారత్‌తో ఫ్రెండ్లీ రిలేషనే కావాలి..కొన్నిశక్తులు విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి: బంగ్లాదేశ్
భారతదేశంతో సంబంధాలను స్థిరంగా ఉంచే ప్రయత్నాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మంగళవారం సూచించింది.
By - Knakam Karthik |
భారత్‌తో ఫ్రెండ్లీ రిలేషనే కావాలి..కొన్నిశక్తులు విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి: బంగ్లాదేశ్
భారతదేశంతో సంబంధాలను స్థిరంగా ఉంచే ప్రయత్నాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మంగళవారం సూచించింది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న తాత్కాలిక ప్రభుత్వం పొరుగుదేశమైన భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటోందని ఆ దేశ ఆర్థిక సలహాదారు డాక్టర్ సలేహుద్దీన్ అహ్మద్ స్పష్టం చేశారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న భారత వ్యతిరేక ఆందోళనల కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు కొంత ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై విలేకరులతో మాట్లాడుతూ పరిస్థితిని వివరించారు. భారత్ లాంటి పెద్ద పొరుగుదేశంతో విభేదాలు లేదా ఘర్షణలు కోరుకోవడం తాత్కాలిక ప్రభుత్వ లక్ష్యం కాదని సలేహుద్దీన్ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఇరుదేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలను తగ్గించి, మళ్లీ సత్సంబంధాలు నెలకొల్పేందుకు ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ స్వయంగా ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగడం రెండు దేశాలకూ లాభదాయకమేనని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌లో ఇటీవల చెలరేగిన భారత వ్యతిరేక నిరసనలు పూర్తిగా రాజకీయ కారణాలతో జరిగినవేనని అహ్మద్ తెలిపారు. వాటికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇరుదేశాల మధ్య వాణిజ్య లావాదేవీలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని కూడా ఆయన భరోసా ఇచ్చారు.
ఆర్థిక సహకారాన్ని మరింత బలపరిచే దిశగా భారత్ నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం దిగుమతి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సలేహుద్దీన్ తెలిపారు. భారత్‌తో బంగ్లాదేశ్ సంబంధాలు చెడగొట్టేందుకు బయటి నుంచి కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. జాతీయ ప్రయోజనాలను పరిరక్షించుకుంటూనే, భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేయడంపై తాత్కాలిక ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన స్పష్టం చేశారు.