ప్రపంచంలో ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు ముందడుగు వేస్తున్నారు. మగవారికి ఏం తక్కువ కాకుండా అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. అయితే మహిళలే కాదు ఇప్పుడు ట్రాన్స్ జెండర్లు కూడా కొన్ని కీలక పదవులు అలంకరిస్తున్నారు. ఉద్యోగాలు, రాజకీయాలు సినిమాల్లో కూడా తమ సత్తా చాటుతున్నారు. జన్యుపరమైన మార్పు వల్ల ట్రాన్స్ జండర్లుగా మారుతున్నారు. మరికొంత మంది మగవారు వారి మానసిక, శారీరక మార్పు వల్ల లింగమార్పిడి చేయించుకొని ట్రాన్స్ జెండర్లుగా మారుతున్నారు.
తాజాగా బంగ్లాదేశ్ లో తస్నువా అనన్ షిషీర్ మొట్టమొదటి లింగమార్పిడి న్యూస్ యాంకర్ అవతారమెత్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్‌లో ఈ వార్తలను చదివారు. 29 ఏళ్ల ఆమె ఇటీవలి ఆడిషన్‌లో ఉద్యోగం కోసం ఎంపికైంది. మీడియా సంస్థలో అనేక వారాల ఇంటెన్సివ్ శిక్షణ పొందిన తరువాత న్యూస్ రీడర్ గా మారారు. షిషిర్ ఇటీవలే జేమ్స్ పి గ్రాంట్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (జెపిజిఎస్పిహెచ్) లో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపిహెచ్) కార్యక్రమంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి రెండు విభాగాలలో తన స్కాలర్‌షిప్‌లను సంపాదించారు.
ఈ సందర్భంగా తస్నువా అనన్ షిషీర్ మాట్లాడుతూ.. మొదట తాను కాస్త భయపడ్డానని.. కానీ అక్కడి వారు తనను ప్రోత్సహించారని అన్నారు. మూడు నిమిషాల ప్రసారం ముగిసిన తర్వాత తనకు కన్నీళ్లు వచ్చాయని అన్నారు. నిజంగా ఇదో విప్లవాత్మక మార్పు అని.. ప్రజల ఆలోచనలో కొత్త కోణాన్ని సృష్టించగలదని ఆమె అన్నారు.