దేశద్రోహం కేసులో హిందూ సాధువు చిన్మోయ్ దాస్‌కు బెయిల్
బంగ్లాదేశ్‌లో హిందూ సాధువు చిన్మోయ్ కృష్ణ దాస్‌కు పెద్ద ఊరట లభించింది.
By Medi Samrat
బంగ్లాదేశ్‌లో హిందూ సాధువు చిన్మోయ్ కృష్ణ దాస్‌కు పెద్ద ఊరట లభించింది. చిన్మయ్ దాస్ కోర్టు నుంచి బెయిల్ పొందారు. బంగ్లాదేశ్ దినపత్రిక ది డైలీ స్టార్ ఈ విషయాన్ని ధృవీకరించింది. చిన్మయ్ దేశద్రోహానికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలున్నాయి. అయితే ప్రస్తుతం ఆయన హైకోర్టు నుంచి బెయిల్ పొందారు.
బంగ్లాదేశ్‌కు చెందిన సనాతనీ జాగరణ్ జోట్ ప్రతినిధి, ఇస్కాన్ మాజీ నాయకుడు చిన్మోయ్ కృష్ణ దాస్‌ను గత ఏడాది నవంబర్ 25న ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఆయన బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారని ఆరోపణలతోపాటు దేశద్రోహ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.
జనవరి 2న చిట్టగాంగ్ ట్రయల్ కోర్టు తన అభ్యర్థనను తిరస్కరించిన తర్వాత ఆయన హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ హైకోర్టు దాస్‌కు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదో వివరించాలని ప్రభుత్వాన్ని కోరింది. దీనిని ఆయన న్యాయవాది ధృవీకరించారు.
ఈ తీర్పుపై రెండు వారాల్లోగా స్పందించాలని బంగ్లాదేశ్ హైకోర్టు ప్రభుత్వాన్ని కోరిందని దాస్ తరపు న్యాయవాది అపూర్వ కుమార్ భట్టాచార్య ANIకి ఒక ప్రకటనలో తెలిపారు.
జనవరి 2న చిట్టగాంగ్‌లో జరిగిన విచారణలో దాస్ తరపు న్యాయవాదులు మాతృభూమి పట్ల తనకు లోతైన గౌరవం ఉందని, అది తన తల్లి పట్ల గౌరవంతో సమానమని.. ఆయన దేశద్రోహి కాదని వాదించారు. ఈ వాదనలు ఉన్నప్పటికీ, కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
చిన్మోయ్ కృష్ణ దాస్ మాతృభూమిని తన తల్లిలా గౌరవిస్తారని, ఆయన దేశద్రోహి కాదని కోర్టుకు చెప్పామని భట్టాచార్య అన్నారు. మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి మహ్మద్ సైఫుల్ ఇస్లాం నేతృత్వంలోని కోర్టు ఇరు పక్షాల వాదనల అనంతరం బెయిల్ మంజూరుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది.
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి మహ్మద్ సైఫుల్ ఇస్లాం నేతృత్వంలోని చిట్టగాంగ్ కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. ప్రాసిక్యూషన్ తరపున మెట్రోపాలిటన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్వకేట్ మోఫిజుర్ హక్ భుయాన్ వాదించారు.