సిడ్నీ నగరాన్ని ముంచేసిన వరదలు

Australia floods. ఆస్ట్రేలియాని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టుగా

By Medi Samrat  Published on  23 March 2021 3:48 AM GMT
Australia floods

ఆస్ట్రేలియాని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టుగా న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలో కురుస్తున్న కుంభ వృష్టి ధాటికి జనం ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సిడ్నీ సిటీ మొత్తం జలమయమైపోయింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లు, కార్యాలయాలు, షాపింగ్‌ మాల్స్‌లోకి వరద నీరు చేరింది. నిత్యావసరాలు లభించక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.డ్యాంలు నిండిపోయాయి. సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని 20కుపైగా నగరాల ప్రజలను అధికారులు హెచ్చరించారు. వందలాది మంది ముంపు బాధితులను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

కొన్ని ప్రాంతాల్లో 300 మిల్లీ మీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. సిడ్నీ నగరంలోని చాలా ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. సహాయక బృందాలు నిర్విరామంగా కృషి చేస్తున్నప్పటికీ ఎమర్జెన్సీకి ఫోన్లు చేసి కాపాడండంటూ జనం ఇప్పటికీ మొర పెట్టుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతానికి ప్రాణ నష్టం లేకపోయినా.. వరదలు మరింత పెరిగితే మాత్రం ప్రాణ నష్టమూ జరిగే ముప్పు ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. విరిగిపడిన చెట్లు, నీట మునిగిన ఇళ్లు, దెబ్బతిన్న రోడ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను కమ్మేస్తున్నాయి.


ఈ స్థాయిలో వరదలు రావడం గత 60 ఏళ్లలో ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. సిడ్నీలో సుమారు 54వేల మందిపై వరద ప్రభావం పడినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొంది. వరదల్లో చిక్కుకున్న జంతువులను రక్షించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. వరదల ధాటికి జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. సిడ్నీ వాసులకు తాగు నీరు అందించే వార్రగంబా డ్యామ్‌ వరద నీరుతో పొంగిపోర్లుతోంది. 1990 సంవత్సరం తర్వాత రిజర్వాయర్‌కు ఇంత పెద్ద ఎత్తున వరద నీళ్లు వచ్చాయని చెబుతున్నారు

ఆస్ట్రేలియా ప్రభుత్వం వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించింది. ఇటు న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం కూడా 16 ప్రకృతి విపత్తుల డిక్లరేషన్లపై సంతకాలు చేసింది. గురువారం నాడు చినుకు చినుకుగా మొదలైన వాన.. శనివారం నాటికి ఉగ్రరూపం దాల్చిందని, ఈ క్రమంలో నదుల్లో నీటి మట్టాలు అమాంతం పెరిగిపోవడం వల్లే వరదలు పోటెత్తాయని అధికారులు చెబుతున్నారు.

వరదల కారణంగా సిడ్నీ పరిసర ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దాదాపుగా నిలిచిపోయింది. రాబోయే కొన్ని వారాల్లో 60 లక్షల మందికి టీకా వేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేలా కనిపించడం లేదని, ఎక్కడికక్కడ వ్యాక్సిన్ల సరఫరా ఆగిపోయిందని న్యూసౌత్ వేల్స్ ప్రీమియర్ గ్లేడిస్ బర్జీక్లియన్ తెలిపారు. పరిస్థితులు మెరుగు పరిన తరువాత ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.. భారీ వర్షాలు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని ఆస్ట్రేలియా వాతావరణశాఖ ప్రకటించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రధాని స్కాట్‌ మారిసన్‌ సూచించారు.. అంతేగాకుండా ప్రజలకు పునరావాస సాయం అందిస్తామని ప్రకటించారు.


Next Story