భయం భయంగా బ్రతుకుతున్న హిందువులు

Attack on Hindus by thugs in Bangladesh. బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువులపై పెద్ద ఎత్తున దాడులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఓ ఫేస్ బుక్ పోస్టు

By అంజి  Published on  17 Oct 2021 12:30 PM GMT
భయం భయంగా బ్రతుకుతున్న హిందువులు

బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువులపై పెద్ద ఎత్తున దాడులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఓ ఫేస్ బుక్ పోస్టు రూమర్ కారణంగా హిందూ ఆలయాలపై బుధవారం నాడు మొదలైన దాడులు.. శుక్రవారం కూడా కొనసాగాయి. హిందువులు ఏర్పాటుచేసిన ఓ మంటపంలో.. ఖురాన్‌ను అవమానించారని వైరల్ పోస్టు సోషల్ మీడియాలో రావడంతో ఆగ్రహించిన ముస్లింలు వారిపై దాడులకు దిగి మంటపాలను ధ్వంసం చేశారు. అల్లరిమూకలను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఆందోళనకారులు మరణించారు.

దసరా చివరి రోజున శుక్రవారం బేగంగంజ్‌ పట్టణంలో ప్రార్థనలు ముగించుకుని వస్తున్న వందలాది మంది ముస్లింలు.. అక్కడున్న దుర్గామాత మంటపంలోకి ఒక్కసారిగా చొరబడ్డారు. మంటపాన్ని ధ్వంసం చేయడంతో పాటు ఆలయ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడ్ని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. మరో భక్తుడ్నీ హత్య చేసి పక్కనున్న చెరువులో పడేశారు. శనివారం ఉదయం ఘటనా స్థలిని పరిశీలిస్తున్న పోలీసులు చెరువులో పడి ఉన్న ఈ మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ అల్లర్లలో మరణించిన వారి సంఖ్య మొత్తంగా 6కు చేరింది.

నౌఖాలీ జిల్లాలో ఇస్కాన్ దేవాల‌యంపై దుండ‌గులు దాడి చేసి విధ్వంసానికి దిగారు. దసరా సందర్భంగా ఇస్కాన్ ఆలయం, భక్తులపై 200 మందికి పైగా దుండగులు దాడి చేశారు. హింసాత్మక దాడిలో 3 మంది భక్తులు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు.

"దాడి చేసిన వారు మెజారిటీ వర్గానికి చెందిన వాళ్లు.. గూండాల్లా ప్రవర్తించారు. ముగ్గురు భక్తులు మరణించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి" అని ఇస్కాన్ నేషనల్ కమ్యూనికేషన్ డైరెక్టర్ వ్రజేంద్ర నందన్ దాస్ మీడియాకి చెప్పారు. మరణించిన వారిలో ఒకరు శ్రీ పార్థ దాస్ (25) గా గుర్తించారు, అతను దుండగుల చేతిలో దారుణంగా చంపబడ్డాడు. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా హిందూ దేవాలయాలపై దాడి చేసిన వారిని శిక్షిస్తామని హామీ ఇచ్చిన కొన్ని గంటల తర్వాత ఈ దాడి జరిగింది. గురువారం నాడు దుర్గా పూజ వేడుకల సందర్భంగా కొంతమంది గుర్తు తెలియని దుండగులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో ముగ్గురు మరణించారు మరియు అనేక మంది గాయపడ్డారు. దీంతో బంగ్లాదేశ్ లోని హిందువులు భయం భయంగా బ్రతుకుతూ ఉన్నారు.

Next Story