ఆఫ్ఘనిస్తాన్‌లోని బాద్గిస్ ప్రావిన్స్‌లో బాంబు పేలుడు సంభవించింది. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా సాధారణ ప్రజలని.. చనిపోయిన వారిలో పిల్లలు కూడా ఉన్నారని అబ్కమారి జిల్లా గవర్నర్ ఖుదాదాద్ తయ్యద్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బాద్గిస్ ప్రావిన్స్‌లోని అబ్కామారి జిల్లాలో రోడ్డు పక్కన ఈ పేలుడు సంభవించింది. శనివారం సాయంత్రం 5 గంటలకు అబ్కమారి జిల్లాలోని చలంక్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. బాధితుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. బాంబు దాడులకు తాలిబాన్ ఉగ్రవాదులే కారణమని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. ల్యాండ్ మైన్ పేలడం వలనే ఈ పేలుడు చోటు చేసుకుందని గుర్తించారు.
కాబూల్‌లో శనివారం జరిగిన బాంబు పేలుడులో మహిళా జర్నలిస్టుతో పాటు నలుగురు మృతి చెందారు. బాగ్లాన్‌లో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులతో పాటు భద్రతా దళంలోని ఎనిమిది మంది సభ్యులు మరణించారు. ఆఫ్ఘన్ దళాలు-తాలిబాన్ల మధ్య గత 24 గంటల్లో 10 ప్రావిన్స్‌లలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నురిస్తాన్ ప్రావిన్స్‌లోని మరో జిల్లాను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు ప్రావిన్స్ నురిస్తాన్‌లోని దోవాబ్ జిల్లా ఆక్రమణ కోసం పోరాటం 20 రోజులుగా కొనసాగుతున్నది. జిల్లాలోని అన్ని మార్గాలను ఉగ్రవాదులు అడ్డుకున్నారు. తాలిబాన్లు నుంగ్రామ్‌ను కూడా చుట్టుముట్టారు. గత మూడు రోజుల్లో మూడు జిల్లాలు తాలిబాన్ల ఆధీనంలోకి వచ్చాయి.