బంగ్లాదేశ్‌లో కాలేజీ క్యాంపస్‌లోకి దూసుకెళ్లిన‌ ఫైటర్ జెట్

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ జెట్ F-7 BJI ఉత్తరా ప్రాంతంలోని మైల్‌స్టోన్ స్కూల్ మరియు కళాశాల క్యాంపస్‌లోకి దూసుకెళ్లింది

By Medi Samrat
Published on : 21 July 2025 3:12 PM IST

బంగ్లాదేశ్‌లో కాలేజీ క్యాంపస్‌లోకి దూసుకెళ్లిన‌ ఫైటర్ జెట్

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ జెట్ F-7 BJI ఉత్తరా ప్రాంతంలోని మైల్‌స్టోన్ స్కూల్ మరియు కళాశాల క్యాంపస్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. ఈ ఘోర ప్రమాదం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. బంగ్లాదేశ్ వార్తాపత్రిక డైలీ స్టార్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్‌ను ఉటంకిస్తూ.. జెట్ ప్రమాదంలో పాఠశాల క్యాంపస్‌కు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొంది.

సోమవారం మధ్యాహ్నం విమానం కూలిపోయిందని బంగ్లాదేశ్ ఆర్మీ తరపున ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-7 బిజిఐ శిక్షణ విమానం ఉత్తరాలో కూలిపోయిందని పేర్కొంది. కూల‌డానికి ఒకటిన్నర నిమిషానికి ముందు విమానం బయలుదేరిందని వెల్ల‌డించారు.

ప్ర‌మాదం త‌ర్వాత కాలిపోతున్న శిథిలాలు, గాయపడిన వ్యక్తుల చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం తర్వాత చుట్టుపక్కలకు మంటలు వ్యాపించాయ‌ని, గాయ‌ప‌డిన వారి కేకలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు, అయితే మృతుల సంఖ్య ఇంకా తెలియరాలేదు. ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఒకరు మరణించారు. ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story