ఆస్ట్రాజెనెకా సంస్థ కరోనా వ్యాక్సిన్ ను తయారుచేసిన సంగతి తెలిసిందే. అయితే తమ కోవిడ్-19 వ్యాక్సిన్ ద్వారా అతి అరుదుగా సైడ్ ఎఫెక్ట్స్ సంభవిస్తాయని ఒప్పుకుంది. తమ వ్యాక్సిన్ తీసుకున్నాక అరుదైన దుష్ప్రభావానికి దారితీస్తుందని కోర్టు పత్రాలలో మొదటిసారి అంగీకరించింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్, వాక్స్‌జెవ్రియా బ్రాండ్ పేర్లతో కోవిడ్ వ్యాక్సిన్ లను ప్రపంచవ్యాప్తంగా విక్రయించింది. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ సహకారంతో అభివృద్ధి చేయబడిన ఈ టీకా కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మరణాలు సంభవించాయని ఆరోపిస్తూ ఫార్మాస్యూటికల్ కంపెనీ క్లాస్-యాక్షన్ దావాను ఎదుర్కొంటూ ఉంది.
2021 ఏప్రిల్‌లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను వేయించుకున్నాక తన మెదడు మీద తీవ్ర ప్రభావం చూపించిందని జామీ స్కాట్ అనే వ్యక్తి బ్రిటన్‌లో పిటిషన్ వేశాడు. ఆ తర్వాత ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై ఇలాంటి కేసులు పెట్టారు. వాటన్నింటిని కలిపి విచారిస్తున్న బ్రిటన్‌లోని ఓ హైకోర్టుకు ‘ఆస్ట్రాజెనెకా’ కంపెనీ తాజాగా వివరణ ఇచ్చింది. ఆస్ట్రాజెనెకా టీకా వల్ల కొందరికి మాత్రమే థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ వచ్చిందని తెలిపింది. చాలా అరుదైన సందర్భాల్లో థ్రోంబోసిస్ సమస్య వస్తోందని కోర్టు ఎదుట స్వయంగా కంపెనీ అంగీకరించింది. భద్రతా కారణాల దృష్ట్యా UKలో ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ను ఇవ్వడం లేదు. అప్పట్లో మహమ్మారిని ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ ప్రభావాన్ని చూపించినప్పటికీ, అరుదైన దుష్ప్రభావాల కారణంగా వ్యాక్సిన్ పై ఆంక్షలు విధించారు అధికారులు.