ఆఫ్ఘనిస్తాన్ లో దారుణ పరిస్థితులు నెలకొనడంతో.. తాలిబాన్ల పాలనలో జీవించలేక పలువురు దేశాన్ని వీడుతున్నారు. కాబూల్ నుంచి భారత వైమానిక దళానికి చెందిన -17 విమానంలో 168 మంది భారత్‌కు చేరుకున్నారు. ఇవాళ ఉదయం కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరిన విమానం ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ల్యాండ్ అయ్యింది. విమానంలో 107 మంది భారతీయులతో సహా 168 మంది ఉన్నారు. ఇప్పటికే ఐఏఎఫ్ రెండు C-17 విమానంలో భారత రాయబార కార్యాలయ సిబ్బందితో సహా 200 మందిని భారత్ ఇప్పటికే తరలించింది.
ఆఫ్ఘనిస్తాన్ లో ఇరుక్కుపోయిన భారతీయులను తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు భారత్ ఇకపై రోజుకు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా అనుమతించిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత.. కాబూల్‌లోని విమానాశ్రయంలో కార్యకలాపాలు అమెరికా నాటో బలగాల నియంత్రణలో ఉన్నాయి. శనివారం కాబూల్‌కు ప్రతిరోజూ రెండు భారతీయ విమానాలు నడపడానికి బలగాలు భారత్‌కు అనుమతి ఇచ్చాయి. నాటో దళాలు తమ ఆయుధాలు, పౌరులను వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రస్తుతం రోజుకు మొత్తం 25 విమాన సర్వీసులను నడుపుతున్నాయి.