ఆప్ఘాన్‌లో ఆకలి పోరాటం.. దీనస్థితిలో చిన్నారులు..!

Afghans Face Hunger Crisis. తాలిబన్ల ఆక్రమణతో ఆప్ఘానిస్తాన్‌ దేశం అల్లాడుతోంది. అక్కడి పరిస్థితులు రోజు రోజుకు

By అంజి  Published on  3 Sept 2021 12:15 PM IST
ఆప్ఘాన్‌లో ఆకలి పోరాటం.. దీనస్థితిలో చిన్నారులు..!

తాలిబన్ల ఆక్రమణతో ఆప్ఘానిస్తాన్‌ దేశం అల్లాడుతోంది. అక్కడి పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో అక్కడ ఆహార సంక్షోభం తలెత్తనుందనే వార్తలు వారిని తీవ్రంగా కలవర పెడుతున్నాయి. ఆప్ఘాన్‌లోని 30 శాతానికిపైగా ప్రజలు ఒక పూట ఆహారం తీసుకుంటున్నారో లేదో తెలియని పరిస్థితి నెలకొందని యూనైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆప్ఘాన్‌లో ఒక నెలకు సరిపడా మాత్రమే ఆహార నిల్వలు ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ ఆహార నిల్వలు త్వరలోనే అయిపోయే ప్రమాదం ఉందని యూఎన్‌ఓ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఆప్ఘాన్‌ సంక్షోభాన్ని తీర్చేందుకు ప్రపంచ దేశాలు కలిసి ముందుకు రావాలని యూఎన్‌ఓ పిలుపునిచ్చింది. ఆప్ఘాన్‌లో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. దీంతో చిన్నారుల్లో సగంమందికిపైగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.

ఆ దేశంలోని 30 శాతం మంది పౌరులకు భోజనం లభించడం లేదని యూఎన్‌ఓ హ్యుమానిటేరియన్ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే భోజనం, మెడికల్ సదుపాయాలు, ఇతర అత్యవసర వస్తువులను ఆప్ఘాన్ దేశానికి అందించడం ద్వారా అక్కడ పరిస్థితిని మరింత దిగజారకుండా ఆపొచ్చని యూఎన్‌ఓ అభిప్రాయపడింది. సెప్టెంబర్ నెలాఖరుకు ప్రపంచ వ్యాప్తంగా ఆహార నిల్వలు నిండుకునే ప్రమాదం ఉందని ఆప్ఘాన్‌లో ఉన్న యూఎన్‌ఓ హ్యుమానిటేరియన్ విభాగం ప్రతినిధి రమీజ్ అలక్‌బరోవ్ తెలిపారు. ఈ సంక్షోభం నుండి ప్రజలను గట్టేక్కించేందుకు మరిన్ని నిధులు కావాల్సి ఉందన్నారు. ఇందకోసం యూఎన్‌ఓ త్వరలోనే ఓ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆప్ఘాన్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ప్రపంచబ్యాంకుతో పాటు అంతర్జాతీయ సంస్థలు సైతం ఆ దేశానికి నిధులను సమకూర్చడం నిలిపివేశాయి.


Next Story