Afghanistan's last finance minister Khalid Payenda now drives Uber in Washington DC. కాబూల్ తాలిబాన్ ఆధీనంలోకి రావడానికి రెండ్రోజుల ముందు ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా
By Medi Samrat Published on 21 March 2022 4:01 AM GMT
కాబూల్ తాలిబాన్ ఆధీనంలోకి రావడానికి రెండ్రోజుల ముందు ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసిన ఖలీద్ పయెండా.. ఇప్పుడు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు వాషింగ్టన్ డీసీలో ఉబర్‌ను నడుపుతున్నారు. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ను హస్తగతం చేసుకోడానికి ముందు పలువురు ప్రముఖులు దేశాన్ని విడిచిపెట్టాలని అనుకున్నారు. కొందరు అక్కడే ఉండిపోగా.. ఇంకొందరు కాస్తా వేరే దేశాలకు వెళ్లిపోయారు.
అలాంటి వారిలో ఖలీద్ పయెండా ఒకరు. ది వాషింగ్టన్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, పయెండా జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో అనుబంధ ప్రొఫెసర్‌గా కూడా పనిచేస్తున్నారు. అష్రఫ్ ఘనీ ప్రభుత్వ చివరి ఆర్థిక మంత్రి, వాషింగ్టన్ పోస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన భార్య, నలుగురు పిల్లలతో కూడిన కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిపారు. తాను చేస్తున్న పనికి తానేమీ బాధపడడం లేదని, తాను పొందుతున్న పనికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పాయెండ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల పట్ల నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. "ప్రస్తుతం, నాకు ఇల్లు అన్నది లేదు.. నేను ఇక్కడికి చెందినవాడిని కాదు, నేను అక్కడికి వెళ్ళలేను" అని ఖలీద్ అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకోవడానికి అమెరికన్ ప్రభుత్వాలను బాధ్యులను చేస్తున్నానని పయెండా ఇంటర్వ్యూలో చెప్పాడు. 9/11 అనంతర విధానానికి ఆఫ్ఘనిస్తాన్‌ను కేంద్రబిందువుగా మార్చిన తర్వాత ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పట్ల అమెరికా తన నిబద్ధతకు ద్రోహం చేసిందని ఆయన విమర్శించారు.