ఆఫ్ఘనిస్థాన్ నుండి బలగాల ఉపసంహరణ పెద్ద తప్పిదం: జార్జ్ బుష్
Afghanistan Troop Pullout A "Mistake". ఆఫ్ఘనిస్థాన్ నుంచి నాటో దళాల ఉపసంహరణను పెద్ద తప్పిదంగా అమెరికా మాజీ అధ్యక్షుడు
By Medi Samrat Published on 14 July 2021 5:38 PM ISTఆఫ్ఘనిస్థాన్ నుంచి నాటో దళాల ఉపసంహరణను పెద్ద తప్పిదంగా అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ అభివర్ణించారు. నాటో దళాలు వెనక్కి వెళ్లడం వల్ల ఆఫ్ఘన్ పౌరులను తాలిబాన్లకు వదిలేసినట్లు అవుతుందని.. తాలిబాన్లు ప్రజలను ఊచకోత కోస్తారని జార్జ్ బుష్ హెచ్చరించారు. ఆఫ్ఘనీ మహిళలు, అమ్మాయిలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారని అన్నారు. ఇది పొరపాటు అని, తన గుండెను కలిచివేస్తోందని జార్జ్ బుష్ తెలిపారు. 2001లో అమెరికాపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆ నాటి అధ్యక్షుడైన బుష్ ఆఫ్ఘనిస్తాన్‌కు దళాలను పంపారు. జర్మనీ ఛాన్సలర్ మెర్కెల్ కూడా నాటో దళాల ఉపసంహరణను వ్యతిరేకిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా సహా నాటో దళాలు పూర్తిగా వైదొలుగుతుండడంతో తాలిబాన్లు చాలా భూభాగాలను ఆక్రమిస్తూ ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో 85 శాతం భూభాగం ఇప్పుడు తమ అధీనంలోనే ఉందని తాలిబాన్లు కొద్ది రోజుల కిందట ఓ ప్రకటన చేశారు. ఇరాన్ తో కీలక సరిహద్దు ప్రాంతంపైనా పట్టు సాధించామని.. సరిహద్దు పట్టణం ఇస్లాం ఖలాను చేజిక్కించుకున్నామని తాలిబాన్లు తమ ప్రకటనలో తెలిపారు. 20 ఏళ్ల కిందట ఆఫ్ఘనిస్థాన్ లో ప్రారంభమైన తమ సైనిక కార్యాచరణ ఆగస్టు 31తో పూర్తిగా ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. తాము ఆశించిన లక్ష్యాలను చేరుకున్నట్టు భావిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరు 11 నాటికి ఉగ్ర దాడులు జరిగి 20 ఏళ్లు పూర్తికానుండడంతో గత మే ఒకటో తేదీ నుంచి బలగాల ఉపసంహరణ మొదలుపెట్టారు. సెప్టెంబరు 11 నాటికి తమ దేశ సైనికులను స్వదేశానికి వచ్చేయాలని తెలిపారు.