పాకిస్థాన్ లో మరో దారుణం.. రాయబారి కుమార్తెను కిడ్నాప్ చేసి..

Afghanistan says envoy’s daughter kidnapped, tortured in Pakistan. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు ప్రస్తుతం శాసించే స్థితిలో ఉన్నారు. వీరికి

By Medi Samrat  Published on  18 July 2021 9:37 AM GMT
పాకిస్థాన్ లో మరో దారుణం.. రాయబారి కుమార్తెను కిడ్నాప్ చేసి..

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు ప్రస్తుతం శాసించే స్థితిలో ఉన్నారు. వీరికి పాకిస్థాన్ మద్దతు కూడా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఇక తాలిబన్లకు పాక్ లో మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే..! తాజాగా ఆఫ్ఘనిస్థాన్ రాయబారి కుమార్తె పాక్ లో కిడ్నాప్ అవ్వడం వెనుక తాలిబన్ల హస్తముందని అంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్ రాయబారి కుమార్తెను అపహరించిన దుండగులు చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

ఇస్లామాబాద్‌లోని రానా మార్కెట్‌లో శుక్రవారం ఓ ప్రైవేటు వాహనంలో వెళ్తున్న రాయబారి కుమార్తె సిల్సిలా అలీ ఖిల్ (26)ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఆపై గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి ఏడు గంటలపాటు చిత్ర హింసలకు గురిచేశారు. తీవ్రగాయాలపాలైన ఆమెను నగరంలోని ఎఫ్-9 మార్కెట్ ప్రాంతంలో పడేసి వెళ్లారు. అధికారులు ఆమెను వెంటనే పాకిస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. సిల్సిలా కిడ్నాప్‌పై ఆఫ్ఘనిస్థాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిందితులను పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై ఇస్లామాబాద్ పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించినట్టు పాకిస్థాన్ విదేశాంగ శాఖ తెలిపింది.

నజీబుల్లా అలిఖిల్ కుమార్తె సిల్సిలా కిడ్నాప్‌, తీవ్ర హింసకు గురి కావడాన్ని ఆఫ్ఘనిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. అత్యంత హేయమైన ఈ చర్యను కఠిన పదజాలంతో ఖండిస్తున్నట్లు తెలిపింది. దౌత్యవేత్తలకు, వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించడానికి పాకిస్థాన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. పాకిస్థాన్‌లోని ఆఫ్ఘన్ రాజకీయ, కాన్సులర్ మిషన్లలో పని చేస్తున్న దౌత్యవేత్తలు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాల ప్రకారం తమ ఎంబసీ, కాన్సులేట్లకు రక్షణ కల్పించాలని ఆఫ్ఘన్ ప్రభుత్వం కోరింది.


Next Story