మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి
ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ బావమరిది, నిషేధిత జమాత్ ఉద్ దవా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ శుక్రవారం లాహోర్‌లో గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
By Medi Samrat Published on 27 Dec 2024 2:30 PM IST
ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ బావమరిది, నిషేధిత జమాత్ ఉద్ దవా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ శుక్రవారం లాహోర్‌లో గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. జమాత్-ఉద్-దవా (JuD) ప్రకారం.. ప్రొఫెసర్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. లాహోర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మధుమేహం కోసం చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం మక్కీ గుండెపోటుతో (అబ్దుల్ మక్కీ మరణించాడు) ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు JD అధికారి PTIకి తెలిపారు.
అబ్దుల్ రెహమాన్ మక్కీని హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ అని కూడా పిలుస్తారు. అతడు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్‌పూర్‌లో జన్మించాడు. హఫీజ్ సయీద్‌తో మక్కీ చాలా కాలంగా సన్నిహితంగా ఉంటాడు. అతడు లష్కర్, జమాత్-ఉద్-దవా (JuD) లో అనేక ముఖ్యమైన పదవులను కూడా నిర్వహించాడు. పొలిటికల్ చీఫ్, లష్కర్ కోసం నిధుల సేకరణ వంటి పనులను కూడా మక్కీ నిర్వహించాడు. అతడు లష్కర్ పాలకమండలి అయిన షురా సభ్యుడు కూడా. 2000లో ఎర్రకోటపై, 2008లో ముంబైలోని తాజ్ హోటల్‌పై జరిగిన ఉగ్రవాద దాడుల్లో మక్కీని భారత ఏజెన్సీలు నిందితుడిగా పరిగణించాయి. అమెరికా ఆర్థిక శాఖ అతడిని 2010లో గ్లోబల్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది.
జూడి చీఫ్ హఫీజ్ సయీద్ బావ మక్కీకి 2020లో ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం ఉగ్రవాదానికి నిధులు సమకూర్చినందుకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. తీవ్రవాద ఫైనాన్సింగ్ కేసులో శిక్ష పడినప్పటి నుంచి జూడి డిప్యూటీ చీఫ్ మక్కీ వార్తల్లో నిలిచారు. మక్కీ పాకిస్థాన్ భావజాలానికి మద్దతుదారు అని పాకిస్థాన్ ముతాహిదా ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) ఒక ప్రకటనలో పేర్కొంది. 2023లో మక్కీని ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. అతని ఆస్తులను స్తంభింపజేయడం, ప్రయాణలపై నిషేధం, ఆయుధాలపై నిషేధం విధించింది. మక్కీ భారత వ్యతిరేక ప్రసంగాలతో పాకిస్తాన్‌లో చాలా ప్రసిద్ధి చెందాడు. 2017లో జమ్మూ కాశ్మీర్‌లో భారత భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్‌లో అతడి కుమారుడు ఒవైద్ రెహ్మాన్ మక్కీ మరణించాడు.
ముంబై దాడుల్లో అబ్దుల్ రెహమాన్ మక్కీ పేరు కూడా ఉంది. అందిన సమాచారం ప్రకారం 26/11 ముంబై ఉగ్రవాద దాడులకు ఉగ్రవాదులకు నిధులు అందించారు. ఈ దాడులలో దాదాపు 166 మంది చనిపోయారు. దాడికి వ్యతిరేకంగా ఆర్మీ చర్యలో భాగంగా తొమ్మిది మంది ఉగ్రవాదులు కూడా మరణించారు. ఆ సమయంలో అమీర్ అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాది సజీవంగా పట్టుబడ్డాడు.