ఆఫ్ఘనిస్థాన్ కొత్త అధ్యక్షుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్

Abdul Ghani Baradar, the Taliban leader who is likely to become new Afghanistan President. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోని అధ్యక్ష భవనాన్ని

By Medi Samrat  Published on  16 Aug 2021 7:55 AM GMT
ఆఫ్ఘనిస్థాన్ కొత్త అధ్యక్షుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోని అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు ఆధీనంలోకి తీసుకొన్నారు. ఆదివారం ఉదయం తాలిబాన్లు కాబూల్ లోకి ప్రవేశించడంతో ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్ ఘనీ ప్రత్యేక విమానంలో తజికిస్తాన్ పారిపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ ప్రెసిడెర్షియల్ ప్యాలెస్ ని తాలిబాన్లు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్ లో మధ్యంతర తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఆఫ్ఘనిస్థాన్ నూతన అధ్యక్షుడిగా తాలిబన్ కమాండ్ ముల్లా బరాదర్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. అష్రఫ్‌ ఘనీ ఎక్కడ ఉన్నారో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామంటూ తాలిబాన్ ప్రతినిధులు ప్రకటన కూడా జారీ చేశారు. ఆఫ్ఘన్‌ లో ఇక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని తమ అధ్యక్షుడిగా బరాదర్‌ వ్యవహరిస్తార‌ని ప్రకటించారు.


1994లో తాలిబాన్లను ఏర్పాటు చేసిన నలుగురిలో ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ఒకరు. 2001లో అమెరికా నేతృత్వంలో ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు జరిగి, తాలిబాన్లు అధికారం కోల్పోయినపుడు నాటో బలగాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నాయకత్వం వహించారు. 2010లో జరిగిన అమెరికా, పాకిస్తాన్ సంయుక్త ఆపరేషన్‌లో ఆయనను కరాచీలో అరెస్ట్ చేశారు. 2012 వరకూ ముల్లా బరాదర్ గురించి పెద్దగా సమాచారం లేదు. శాంతి చర్చలను ప్రోత్సహించడానికి అప్పటి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కొంతమంది బందీల విడుదలకు సంబంధించి ఒక జాబితాను ప్రచురించింది. వారిలో బరాదర్ పేరు కూడా ఉంది. 2013 సెప్టెంబర్‌లో పాకిస్తాన్ ప్రభుత్వం బరాదర్‌ను విడుదల చేసింది.

ముల్లా బరాదర్ తాలిబాన్ నేత ముల్లా మొహమ్మద్ ఉమర్‌కు అత్యంత నమ్మకస్తుడు. డిప్యూటీగా కూడా ఉన్నారు. ముల్లా ఉమర్ అరెస్ట్ అయినపుడు, ముల్లా బరాదర్ తాలిబాన్ల రెండో అతిపెద్ద నేతగా మారారు. . 2018లో అమెరికాతో చర్చలు జరపడానికి తాలిబాన్లు ఖతార్‌లో కార్యాలయం ప్రారంభించినప్పుడు బరాదర్‌ను తాలిబాన్ రాజకీయ పార్టీకి చీఫ్‌గా చేశారు. అమెరికాతో చర్చలను ముల్లా బరాదర్ ఎప్పుడూ సమర్థించేవారు. 1994లో తాలిబాన్ల ఏర్పాటు తర్వాత ఆయన ఒక కమాండర్‌గా, వ్యూహకర్తగా కీలక పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్ లో జరిగిన అన్ని యుద్ధాల్లో తాలిబాన్ల తరఫున బరాదర్ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. తాలిబాన్లు అధికారం కోల్పోయిన సమయంలో తాలిబాన్ల ప్రభుత్వంలో ఆయన రక్షణ శాఖ ఉప మంత్రిగా ఉన్నారు.


Next Story