తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని వృత్తి విద్యా పాఠశాలలో శనివారం జరిగిన కత్తి దాడిలో ఎనిమిది మంది మరణించగా, 17 మంది గాయపడినట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. యిక్సింగ్ సిటీలోని వుక్సీ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. 21 ఏళ్ల అనుమానితుడు జు సంఘటన స్థలంలో పట్టుబడ్డాడు. అతను తన నేరాన్ని అంగీకరించాడని యిక్సింగ్ పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ప్రభుత్వం ద్వారా నడపబడే జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ సంవత్సరం పాఠశాలలో గ్రాడ్యుయేట్ అయిన జు, పరీక్షలలో విఫలమైనందున గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అందుకోలేదని, ఇంటర్న్‌షిప్ వేతనంపై అసంతృప్తితో తన కోపాన్ని వెళ్లగక్కాడు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఈ వారంలో పౌరులపై ఇది రెండో దాడి. నవంబర్ 12న, జుహై నగరంలోని స్పోర్ట్స్ సెంటర్‌లో ఒక వ్యక్తి తన కారును జనంపైకి దూసుకెళ్లడంతో ముప్పై ఐదు మంది మరణించారు. 43 మంది గాయపడ్డారు. ఫ్యాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని విడాకుల ఆస్తి విభజన ఫలితం పట్ల అసంతృప్తితో అతని చర్య తీసుకున్నాడని చెప్పారు.
ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు అన్ని విధాలా కృషి చేయాలని కోరారు. ఇటీవలి నెలల్లో చైనాలో పౌరులపై కత్తితో దాడి చేయడంతో పాటు కారు దూసుకెళ్లే సంఘటనలు ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్నాయి.