భారీ భూకంపం.. ఏడుగురు మృతి.. 85 మందికి తీవ్రగాయాలు
7 dead, 85 injured after strong quake hits west Sumatra. ఇండోనేషియాలోని భారీ భూకంపం సంభవించింది. వివరాళ్లోకెళితే.. వెస్ట్రన్ ప్రావిన్స్‌లోని
By Medi Samrat Published on 26 Feb 2022 9:07 AM ISTఇండోనేషియాలోని భారీ భూకంపం సంభవించింది. వివరాళ్లోకెళితే.. వెస్ట్రన్ ప్రావిన్స్‌లోని పశ్చిమ సుమత్రాలో 6.1 తీవ్రతగా నమోదు అయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) వెల్లడించింది. ప్రకంపనల ధాటికి 10,000 కంటే ఎక్కువ భవనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించగా.. 85 మందికి పైగా గాయపడ్డారని సీనియర్ అధికారి తెలిపారు. శుక్రవారం ఉదయం 7.09 గంటలకు భూ ప్రకపంనలు చోటు చేసుకున్నాయి. భూకంప కేంద్రం బుకిటిన్గీకి 66 కిలోమీటర్ల దూరంలో ఉందని.. భూఅంతర్భాగంలో 12.3 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది.
అంతకుముందు వాతావరణ శాస్త్రం, క్లైమాటాలజీ మరియు జియోఫిజిక్స్ ఏజెన్సీ (BMKG) ఒక నివేదికను విడుదల చేసింది. తొలుత భూకంప తీవ్రత 6.2తో ఉందని తెలిపిన ఏజెన్సీ.. 6.1కి సవరించినట్లు హెడ్ ద్వికోరిటా కర్ణావతి తెలిపారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ మిటిగేషన్ ఏజెన్సీ తాత్కాలిక ప్రతినిధి అబ్దుల్ ముహారి మాట్లాడుతూ.. భూకంప తీవ్రతకు పసమన్ బరాత్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు, పసమాన్ జిల్లాలో మరో నలుగురు మరణించారని తెలిపారు. మొత్తం 85 మంది గాయపడగా.. గాయపడిన వ్యక్తులు రెండు జిల్లాల్లో ఉన్నారని పేర్కొన్నారు. విపత్తు కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా దాదాపు 5,000 మంది ప్రజలు ఇళ్లలలో నుంచి పారిపోయి 35 పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారని అబ్దుల్ ముహారి తెలిపారు. తప్పిపోయిన వ్యక్తులు, తుఫాన్ ప్రభావితమైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. పోలీసులు, విపత్తు ఏజెన్సీ సిబ్బంది, సైనికులు, రక్షకులు, వాలంటీర్లు, నివాసితులతో కూడి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నట్లు ప్రతినిధి తెలిపారు.