తేరుకోకముందే మరోసారి భారీ భూకంపం

రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. కురిల్‌ ఐలాండ్‌లో గురువారం భూమి కంపించింది.

By Medi Samrat
Published on : 31 July 2025 5:32 PM IST

తేరుకోకముందే మరోసారి భారీ భూకంపం

రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. కురిల్‌ ఐలాండ్‌లో గురువారం భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.5గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. కమ్‌చట్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం సంభవించగా, అదే ప్రాంతానికి 200 మైళ్ల దూరంలో తాజాగా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తాజా భూకంపం కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికలూ జారీ కాలేదు.

బుధవారం రష్యాలోని ఫార్ ఈస్టర్న్ కమ్చట్కా ద్వీపకల్పంలో 8.7 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. అమెరికా, జపాన్, సమీపంలోని ఇతర దేశాలకు పసిఫిక్ మహాసముద్ర సునామీ హెచ్చరికలు జారీ చేశారు. యూఎస్‌ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంపం 19.3 కిలోమీటర్ల (12 మైళ్ళు) లోతులో సంభవించిందని, అవాచా బేలోని దాదాపు 165,000 జనాభా కలిగిన తీరప్రాంత నగరం పెట్రోపావ్లోవ్స్క్-కామ్‌చాట్స్కీకి తూర్పు-ఆగ్నేయంగా దాదాపు 125 కిలోమీటర్ల (80 మైళ్ళు) దూరంలో ఉందని నివేదించింది. భూకంపం తరువాత, కమ్చట్కా ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో 3 నుండి 4 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడ్డాయని రష్యా అత్యవసర పరిస్థితుల ప్రాంతీయ మంత్రి తెలిపారు.

Next Story