కొవిడ్ ఆసుప‌త్రిలో అగ్నిప్ర‌మాదం.. 50 మంది రోగులు మృతి

50 die, dozens injured after fire in Covid-19 ward at hospital in southern Iraq. ఇరాక్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ

By Medi Samrat  Published on  13 July 2021 8:49 AM IST
కొవిడ్ ఆసుప‌త్రిలో అగ్నిప్ర‌మాదం.. 50 మంది రోగులు మృతి

ఇరాక్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఇరాక్‌లోని ఓ ఆస్ప‌త్రి కరోనావైరస్ వార్డులో సోమవారం నాడు మంటలు చెలరేగాయి. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన‌ ఈ ఘ‌ట‌న‌లో 50 మంది మృతి చెందగా.. కొద్దిమందికి గాయపడ్డారు. దక్షిణ ఇరాక్ నగరమైన నాసిరియాలోని అల్-హుస్సేన్ టీచింగ్ హాస్పిటల్‌లో ఈ ప్ర‌మాదం సంభ‌వించింద‌ని అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే 50 మంది మృతి చెందగా.. మరికొందరు పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు బృందాలు ఘటన స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి

ఆక్సిజన్ సిలిండర్ పేలడమో లేదా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల అయినా మంటలు చెలరేగి ఉంటాయ‌ని.. ఇందుకు సంబందించి వివరాలు తెలియాల్సివుంద‌ని అధికారులు తెలిపారు. మూడు నెలల క్రితం ప్రారంభించిన ఈ కొత్త వార్డులో 70 పడకలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రమాదం జ‌రిగినప్పుడు వార్డులో 63 మంది రోగులు ఉన్నారని తెలిపారు. కొవిడ్‌ వార్డుల్లో చిక్కుకున్న రోగులను బటయకు తీసుకొచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ఆరోగ్య సిబ్బంది తెలిపారు.

ఇదిలావుంటే.. ఇరాకీ కొవిడ్‌ ఆసుపత్రుల‌లో ఈ ఏడాది ఇది రెండ‌వ అతిపెద్ద‌ అగ్నిప్రమాదం. ఏప్రిల్‌లో బాగ్దాద్‌లోని ఇబ్న్ అల్-ఖతీబ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగడంతో 82 మంది మరణించారు. ఈ ఘ‌ట‌న ఆసుప‌త్రి సిబ్బంది యొక్క నిర్ల‌క్ష్యం కార‌ణంగానే జ‌రిగింద‌ని వెలుగులోకి వ‌చ్చింది. ఇక‌ ఇరాక్ లో క‌రోనా తీవ్రంగా ఉంది. 14 ల‌క్ష‌ల మందికి పైగా కొవిడ్ బారిన ప‌డ‌గా.. 13 ల‌క్ష‌ల మంది కోలుకున్నారు. 17,592 మంది మృత్యువాత ప‌డ్డారు.


Next Story