18 రోజుల తర్వాత చిన్నారి ఆచూకీ లభ్యం.. ఫలించిన దేశ ప్రజల ప్రార్థనలు
4 year old Australian girl found alive after 18 day hunt. 18 రోజుల క్రితం కిడ్నాప్ గురైన నాలుగేళ్ల చిన్నారి ఆచూకీ లభ్యమైంది. చాకచక్యంగా నిందితుడి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు..
By అంజి Published on 3 Nov 2021 2:50 PM GMT18 రోజుల క్రితం కిడ్నాప్ గురైన నాలుగేళ్ల చిన్నారి ఆచూకీ లభ్యమైంది. చాకచక్యంగా నిందితుడి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు.. చిన్నారి క్లియోను క్షేమంగా ఇంటికి తీసుకురాగలిగారు. ఈ ఘటన ఆస్ట్రేలియా దేశంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 18 రోజుల క్రితం చిన్నారి క్లియో తన తల్లిదండ్రులతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. రాత్రి సమయంలో టెంట్ వేసుకుని అందులో నిద్రించారు. ఈ క్రమంలోనే క్లియోను దుండగుడు కిడ్నాప్ చేశాడు. తల్లిదండ్రులు నిద్ర లేచి చూసే సరికి క్లియో కనిపించకపోవడంతో వారు ఆందోళన చెందారు. ఆ ప్రాంతమంతా వెదికారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ కూతురి ఆచూకీ చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా క్లియో తల్లిదండ్రులు అభ్యర్థించారు. చిన్నారి కిడ్నాప్ వ్యవహారం ప్రతి ఒక్కరిని కలచివేసింది. చిన్నారి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నారి తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచారు. దీంతో కేసు తీవ్రత మారింది. పోలీసులు చిన్నారి క్లియో కిడ్నాప్‌ను సవాలుగా తీసుకున్నారు. క్లియో వెళ్లిన విహారయాత్ర ప్రాంతంతో పాటు పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. దీంతో చివరికి పోలీసులు డిటెక్టివ్‌ల సాయం తీసుకున్నారు. అయితే క్లియో ప్రాణాలతో ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు.
18 రోజుల గాలింపు తర్వాత క్లియోను కిడ్నాప్ చేసిన నిందితుడి గురించి తెలిసింది. వెంటనే అతడి స్థావరాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అతడి ఇంట్లో ఓ గదికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన వారు.. వెంటనే దాన్ని పగలకొట్టారు. లోపల క్లియో కూర్చొని ఉండటాన్ని అధికారులు చూడడంతో వారి నోట మాట రాలేదు. వెంటనే క్లియోని అక్కడి నుంచి కాపాడి ఆస్పత్రికి తరలించారు అధికారులు. కిడ్నాపర్ దగ్గర క్లియో ఏ మాత్రం భయపడకుండా ఉండటం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. చిన్నారి క్లియోను చూసిన వారికి ఒక్కసారిగా ఆనంద బాష్పాలు వచ్చాయి. క్లియో క్షేమం కోసం ప్రార్థించిన ప్రతిఒక్కరికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.