పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో షాప్‌లో దొంగతనం చేశారని ఆరోపిస్తూ ఒక యువకుడితో సహా నలుగురు మహిళలను పలువురు వ్యక్తులు లాగి కొట్టారు. ఈ ఘటన లాహోర్‌కు 180 కిలోమీటర్ల దూరంలోని ఫైసలాబాద్‌లో సోమవారం చోటుచేసుకుంది. ఒక యువకుడితో సహా నలుగురు మహిళలను బట్టలు విప్పించి కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. వీరికి ఎవరూ సహకరించవద్దని హుకుం జారీ చేశారు. మహిళలు తమను వెళ్లనివ్వమని ఏడుస్తూ అందరిని అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వారిని గంటపాటు నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనతో సంబందమున్న ఐదుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశామని పోలీసు అధికారి తెలిపారు.
దీనిపై విచారణ జరుపుతున్నారని.. ఇందులో భాగస్వాములైన వారందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. పలు సెక్షన్‌ల కింద ఐదుగురు అనుమానితులతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని అన్నారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఫైసలాబాద్‌లోని బావ చాక్ మార్కెట్‌కు వ్యర్థాలను సేకరించేందుకు వెళ్లాం. దాహం వేసి ఉస్మాన్ ఎలక్ట్రిక్ స్టోర్ లోపలికి వెళ్లి వాటర్ బాటిల్ అడిగాము. అయితే దొంగతనం చేయాలనే ఉద్దేశంతో దుకాణంలోకి ప్రవేశించామని ఆ షాపు యజమాని సద్దాం ఆరోపించాడు. సద్దాం మరియు ఇతర వ్యక్తులు మమ్మల్ని కొట్టడం ప్రారంభించారు. షాపు బయటికి లాగి.. బట్టలు విప్పికొడుతూ వీడియోలు తీశారు. ఈ దారుణాన్ని ఆపేందుకు ఎవరూ ప్రయత్నించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు జల్లడపడుతున్నామని.. అయితే.. సద్దాం సహా ఐదుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్లు ఫైసలాబాద్ పోలీస్ హెడ్ అబిద్ ఖాన్ తెలిపారు.