పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 30 మంది మృతి
30 Killed in Road Accident in Pakistan's Khyber Pakhtunkhwa.పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది
By తోట వంశీ కుమార్ Published on 8 Feb 2023 3:58 AM GMTపాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 30 మంది దుర్మరణం చెందగా మరో 15 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో జరిగింది.
ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని కోహిస్తాన్ జిల్లాలో ప్రయాణీకులతో గిల్గిత్ నుంచి రావల్పిండి వెళ్తున్న బస్సు షిటియాల్ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్కూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి ఈ దుర్షటన జరిగింది. ప్రమాద స్థలంలో చీకటి కారణంగా సహాయక చర్యలు చేపట్టడంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మృతదేహాలను ఆర్‌హెచ్‌సీ ఆస్పత్రికి తరలించారు.
ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 30 మందికి పైగా మరణించారు. 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ ప్రమాదం పై గిల్గిత్ బాల్టిస్థాన్ ముఖ్యమంత్రి ఖలీద్ ఖుర్షీద్ స్పందించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. మెరుగైన సమన్వయం మరియు అత్యవసర ప్రతిస్పందన పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఘటనపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. క్షతగాత్రులకు అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గత నెల బలూచిస్తాన్‌లోని లాస్బెలాలో ప్యాసింజర్ కోచ్ లోయలో పడి కనీసం 41 మంది మరణించిన సంగతి తెలిసిందే.