ఫిబ్రవరి 24 నుండి రష్యా ఉక్రెయిన్ దాడి చేయడం ప్రారంభించింది. అయితే ఈ దాడుల్లో ఇప్పటివరకు 28 మంది చిన్నారులు మరణించారని ఉక్రెయిన్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. యుద్ధంలో 840 మంది చిన్నారులు గాయపడ్డారని శుక్రవారం ఉక్రేనియన్ అధికారి ఒకరు తెలిపారు. ఉక్రెయిన్ జాతీయ భద్రతా మండలి అధిపతి ఒలెక్సీ డానిలోవ్.. ఉక్రెయిన్ టెలివిజన్‌లో ఈ గణనను ప్రకటించారు. యుద్ధంలో మహిళలు, పిల్లలు తప్పించుకోవడానికి మార్గం కల్పించాలని అతను రష్యాకు విజ్ఞప్తి చేశాడు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా దాడులు చేస్తోంది. ఈ దాడి ఉక్రెయిన్‌లో అనేక వందల మంది పౌరుల మరణాలకు దారితీసింది.
తాజాగా కైవ్ సమీపంలోని బుచా జిల్లాలో ఒక పౌర కారుపై రష్యా బలగాలు కాల్పులు జరిపాయి. 17 ఏళ్ల బాలికతో సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. దీంతో కైవ్ ప్రాంతంలోని ప్రాసిక్యూటర్ కార్యాలయం క్రిమినల్ ప్రొసీడింగ్‌లను ప్రారంభించింది.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఒక మిలియన్ కంటే ఎక్కువ ఉక్రేనియన్లు పొరుగు దేశాలకు పారిపోయారు. సంక్షోభంపై మూడో రౌండ్ చర్చల కోసం ఉక్రేనియన్, రష్యా ప్రతినిధులు ఈ వారాంతంలో సమావేశం కావాలని ప్లాన్ చేస్తున్నారు. "ప్రసూతి ఆసుపత్రులు, కిండర్ గార్టెన్లు, పాఠశాలలు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు డారియా హెరాసిమ్‌చుక్ తెలిపారు. రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలలో సుమారు ఒకటిన్నర మిలియన్ల మంది పిల్లలు ఉన్నారు. వీరిలో అనాథలు, తక్షణ సహాయం అవసరమయ్యే వైకల్యాలున్న పిల్లలు ఉన్నారని" ఆమె చెప్పారు.