చైనాలోని నైరుతి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు బోల్తా పడి.. పల్టీలు కొట్టింది. పర్వత ప్రాంతమైన గుయిజౌ ప్రావిన్స్ రాజధాని గుయాంగ్ నగర పరిధిలోని సాండు కౌంటీలో ఈ తెల్లవారుజామున ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బస్సు బోల్తా పడిన సమయంలో అందులో 47 మంది ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రుల అందరినీ సమీప ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలోనే అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదంలో ఇది మొదటిదని స్థానిక మీడియా పేర్కొంది. ఘటన అనంతరం అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ప్రావిన్స్ రాజధాని గుయాంగ్‌కు ఆగ్నేయంగా 170 కి.మీ (105 మైళ్లు) దూరంలో ఉన్న సాండు కౌంటీలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇక ఇటీవల చైనాలోని చాంగ్‌షా నగరంలో 42 అంతస్తుల భవనంలో గత వారం అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌గా మారాయి.