హిందువులపై దాడులు.. పాకిస్థాన్‌ను దాటేసిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లలో హిందువులపై దాడులు పెరుగుతున్నాయి.
By Medi Samrat Published on 20 Dec 2024 8:30 PM IST
బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లలో హిందువులపై దాడులు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌లో ఈ ఏడాది డిసెంబర్ 8 వరకు హిందువులు, ఇతర మైనారిటీలపై 2,200 హింసాత్మక కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభకు తెలిపింది.
మానవ హక్కుల సంస్థల డేటాను ఉటంకిస్తూ.. విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో మాట్లాడుతూ.. ఈ ఏడాది అక్టోబర్ వరకు పాకిస్తాన్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై 112 హింసాత్మక కేసులు నమోదయ్యాయి. 2023లో బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై 302 హింసాత్మక ఘటనలు నమోదుకాగా.. పాకిస్థాన్‌లో 103 ఘటనలు జరిగాయి.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ మినహా ఇతర పొరుగు దేశాల్లో మైనారిటీలపై హింసాత్మక కేసులు నమోదు కాలేదని మంత్రి చెప్పారు. మత అసహనం, మతపరమైన హింస, మైనారిటీ వర్గాలపై దాడులను అరికట్టేందుకు, వారి భద్రతకు భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను కోరింది. ఇప్పటిరకూ అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌లోని మైనారిటీల దుస్థితిని భారత్ హైలైట్ చేస్తూనే ఉంది.
ప్రభుత్వం తన ఆందోళనలను బంగ్లాదేశ్ ప్రభుత్వంతో పంచుకుంది. మైనారిటీల భద్రతకు ఢాకా అవసరమైన చర్యలు తీసుకుంటుందని భారత్ భావిస్తోంది. డిసెంబరు 9, 2024న బంగ్లాదేశ్‌లో విదేశాంగ కార్యదర్శి పర్యటన సందర్భంగా కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మాట్లాడుతూ.. 'ఢాకాలోని భారత హైకమిషన్ బంగ్లాదేశ్‌లోని మైనారిటీలకు సంబంధించిన పరిస్థితులను పర్యవేక్షిస్తోంది. మైనారిటీలతో సహా పౌరులందరి జీవితాలు, వారి స్వేచ్ఛను రక్షించే ప్రాథమిక బాధ్యత సంబంధిత దేశ ప్రభుత్వంపై ఉందన్నారు.
బంగ్లాదేశ్
2024లో డిసెంబర్ 8 వరకు మైనారిటీలపై హింసాత్మక సంఘటనలు - 2,200
2023లో మైనారిటీలపై హింసాత్మక సంఘటనలు - 302
2022లో మైనారిటీలపై హింసాత్మక సంఘటనలు - 47
పాకిస్తాన్
అక్టోబర్ 2024 వరకు మైనారిటీలపై హింసాత్మక సంఘటనలు - 112
2023లో మైనారిటీలపై హింసాత్మక సంఘటనలు - 103
2022లో మైనారిటీలపై హింసాత్మక సంఘటనలు - 241