ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది భక్తుల దుర్మరణం

20 people were killed when a van overturned in Pakistan. పక్క దేశం పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిండా నీరు ఉన్న ఓ గుంతలో వ్యాన్‌ బోల్తా పడింది.

By అంజి  Published on  18 Nov 2022 8:47 AM GMT
ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది భక్తుల దుర్మరణం

పక్క దేశం పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిండా నీరు ఉన్న ఓ గుంతలో వ్యాన్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సింధ్‌ ప్రావిన్స్‌లో జరిగింది. ప్రసిద్ధ సూఫీ మందిరానికి భక్తులతో వెళ్తున్న వ్యాన్‌ నేషనల్‌ హైవే పక్కనున్న గుంతలో బోల్తా పడింది. వాహనం ఖైర్‌పూర్‌ నుంచి సెహ్వాన్‌ షరీప్‌ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.

మృతి చెందిన వారిలో 12 మంది చిన్నారులు ఉన్నారు. ''సింధ్ ప్రావిన్స్‌లో గురువారం ఇటీవల వరదల కారణంగా కొట్టుకుపోయిన రహదారిపై నీటితో నిండిన గుంటలో వ్యాన్‌ పడిపోయింది'' అని స్థానిక పోలీసు అధికారి ఖాదీమ్ హుస్సేన్ తెలిపారు. డ్రైవర్ రోడ్డుపై మళ్లింపు గుర్తును చూడలేకపోయాడు. దీంతో వ్యాన్ 25 అడుగుల లోతైన గుంటలో పడిపోయింది. రోడ్డు ప్రమాదాల కారణంగా.. పాకిస్తాన్ ప్రపంచంలోనే మూడవ అత్యధిక మరణాల రేటును కలిగి ఉంది. సరిగ్గాలేని హైవేలు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో ఇటీవల కురిసన వర్షాల వల్ల రోడ్లు అధ్వాన్నంగా మారాయి.

Next Story