బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీ.. 20 మంది సజీవ దహనం
20 People died in Bus-oil tanker crash.బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీ కొన్నాయి. మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనం
By తోట వంశీ కుమార్ Published on 16 Aug 2022 5:29 AM GMTబస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీ కొన్నాయి. మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘోర ప్రమాదం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళితే.. ప్రయాణీకులతో లాహెర్ నుంచి కరాచీకి బస్సు బయలు దేరింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని ముల్తాన్ కు సమీపంలో ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్.. బస్సును ఢీ కొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఆయిల్ ట్యాంక్ కావడంతో క్షణాల్లో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. చాలా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో 20 మంది మరణించగా.. మరో 6 గురు తీవ్రంగా గాయపడ్డారని రెస్క్యూ సిబ్బంది ప్రతినిధి తెలిపారు. గాయపడిన వారిని ముల్తాన్‌లోని నిష్టర్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయని, ఎవరి మృతదేహం ఏదో గుర్తించడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. డీఎన్ఏ పరీక్ష అనంతరం మృతుల కుటుంబాలకు మృతదేహాలను అప్పగించనున్నట్లు వెల్లడించారు.
అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటనపై పంజాబ్ సీఎం పర్వేజ్ ఎలాహీ తీవ్ర విచారణం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా మృతులను గుర్తించి వారి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కాగా.. శనివారం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ప్రయాణీకుల బస్సును ట్రక్కును ఢీ కొట్టగా 13 మంది మరణించిన సంగతి తెలిసిందే.