పాకిస్తాన్‌లోని పెషావర్‌లో మసీదులో సోమవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మరణించగా.. 96 మంది గాయపడ్డారు. వివరాల ప్రకారం.. జుహర్ ప్రార్థనల అనంతరం దాదాపు మధ్యాహ్నం 1.40 గంటలకు పోలీస్ లైన్స్ ఏరియా సమీపంలో పేలుడు సంభవించింది. పేలుడు తాకిడికి మసీదు ఒకవైపు కూలిపోయింది. మసీదు లోపల నుండి చిత్రీకరించిన ఒక వీడియోలో నేలపై ఉన్న శిధిలాలను చూడవచ్చు.
ప్రార్థనల సమయంలో మసీదులో ఆత్మాహుతి దాడికి ప్రయత్నించిన వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడని జియో న్యూస్ నివేదికలు పేర్కొన్నాయి. ఆత్మాహుతి దాడి చేసిన వ్యక్తి ప్రార్థన సమయంలో ముందు వరుసలో ఉన్నాడని, అతను తనను తాను పేల్చుకున్నాడని భద్రతా అధికారులను ఉటంకిస్తూ పిటిఐ వార్తా సంస్థ తెలిపింది.
గాయపడిన వారిని పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వారిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పేలుడు సంభవించిన ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని విధించారు. రక్షణ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.