టేకాఫ్‌ అయిన కాసేపటికే కూలిన విమానం.. ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి

2 kids among 4 killed as aircraft crashes in Australia. తూర్పు తీరంలో తేలిక పాటి విమానం కుప్ప కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న ఇద్దరు పిల్లలతో సహా నలుగురు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు

By అంజి  Published on  19 Dec 2021 8:27 AM GMT
టేకాఫ్‌ అయిన కాసేపటికే కూలిన విమానం.. ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి

ఆదివారం ఉదయం ఆస్ట్రేలియా తూర్పు తీరంలో తేలిక పాటి విమానం కుప్ప కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న ఇద్దరు పిల్లలతో సహా నలుగురు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. 69 ఏళ్ల పైలట్ ముగ్గురు ప్రయాణికులను జాయ్ రైడ్‌కు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:00 గంటల తర్వాత నగరం ఉత్తరాన ఉన్న బేసైడ్ సబర్బ్ అయిన రెడ్‌క్లిఫ్ సమీపంలో చిన్న విమానం లోతులేని నీటిలో కూలిపోవడంతో నలుగురు మరణించారని క్వీన్స్‌లాండ్ రాష్ట్ర పోలీసులు తెలిపారు.

రాక్‌వెల్ ఇంటర్నేషనల్ విమానం మోరేటన్ బేలో తలక్రిందులుగా తేలుతున్నట్లు చిత్రాలు చూపించాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అది క్రాష్ అయినట్లు ప్రాథమిక నివేదికలు సూచించాయని, అయితే కారణాన్ని గుర్తించేందుకు పూర్తి విచారణకు ఆదేశించామని అధికారులు తెలిపారు. పోలీసు ఇన్‌స్పెక్టర్ క్రెయిగ్ వైట్ క్రిస్మస్ సందర్భంగా దీనిని "విషాద ప్రమాదం"గా పేర్కొన్నారు. మూడు మృతదేహాలను పోలీసు డైవర్లు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.

ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ కమీషనర్ అంగస్ మిచెల్ మాట్లాడుతూ, ప్రమాదానికి గల కారణాలపై నివేదిక ఆరు నుండి ఎనిమిది వారాల్లో పూర్తవుతుందని చెప్పారు. విచారణలో సహాయపడేందుకు జాతీయ రాజధాని కాన్‌బెర్రా నుండి అదనపు పరిశోధకులను పంపనున్నట్లు ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో తెలిపింది. కూలిన ప్రదేశం నుంచి శిథిలాలను వెలికితీసేందుకు కొంత సమయం పట్టవచ్చని అధికారులు తెలిపారు.

Next Story